అభివృద్ధిలోనే పోటీ.. బూతుల్లో కాదు..

ABN , First Publish Date - 2021-10-25T04:31:03+05:30 IST

టీడీపీ అభివృద్ధి చేయడంలో పోటీపడుతుందేగాని బూతులు వాడడంలో కాదని ఆ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

అభివృద్ధిలోనే పోటీ.. బూతుల్లో కాదు..
టీడీపీ కార్యకర్తల సమావేశంలో నెలవల తదితరులు

టీడీపీ సూళ్లూరుపేట  నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల

సూళ్లూరుపేట, అక్టోబరు 24 : టీడీపీ అభివృద్ధి చేయడంలో పోటీపడుతుందేగాని బూతులు వాడడంలో కాదని ఆ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం  అన్నారు. ఆదివారం స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో ఉదయం పట్టణ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టించారని, అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆరోపించారు. చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా  34వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ఇందులో 10వేల ఎకరాల్లో రాజధానికి కేటాయించి మిగిలిన 24వేల ఎకరాలను జగన్‌ ప్రభుత్వం మార్కెటింగ్‌ చేసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఆగమేఘాలపై జరిగే అవకాశం ఉండేదన్నారు. కానీ జగన్‌రెడ్డి చంద్రబాబుపై అక్కస్సుతో అమరావతి భూములను పాడుపెట్టేసి మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు అందరూ ప్రజలను చైతన్యపరచి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ అరాచకపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. సాయంత్రం మండలంలోని కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రూరల్‌ అధ్యక్షుడు లొక్కు శంకరయ్య, కార్యదర్శి పాకం వెంకటసుబ్బయ్య, పట్టణ కార్యదర్శి ఏజీ కిశోర్‌, అలవల శ్రీనివాసులు, బండారు ఆంజనేయులు, చిన్న మాలకొండయ్య, మాజీ కౌన్సిలర్లు మేడా అమరజ్యోతి, బుద్ది విజయలక్ష్మి, మండల,  పట్టణ,  బూత్‌ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:31:03+05:30 IST