రైతు సమస్యలపై టీడీపీ పోరు

ABN , First Publish Date - 2021-09-18T05:39:15+05:30 IST

రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు పోరు బాట పట్టారు.

రైతు సమస్యలపై టీడీపీ పోరు
అనకాపల్లిలో ధర్నా నిర్వహిస్తున్న తెలుగుదేశం నాయకులు బుద్దా నాగజగదీశ్‌, పీలా గోవింద, తదితరులు

గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలు

ఎడ్ల బళ్లతో ప్రదర్శనలు

అడ్డుకున్న పోలీసులు... వాగ్వాదాలు

పలువురి అరెస్టు, విడుదల


విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు పోరు బాట పట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నేతలు ఎండగట్టారు. టీడీపీ అధిష్ఠానం పిలుపుమేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం ‘రైతు కోసం తెలుగుదేశం’ నినాదంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలు కిడారి శ్రావణ్‌, గిడ్డి ఈశ్వరి, పప్పల చలపతిరావు, దువ్వారపు రామారావు, బుద్ద నాగజగదీశ్‌, పీలా గోవింద, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదాలు జరిగాయి. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో తన ఇంటి వద్ద రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం లేదని దుయ్యబట్టారు. రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని ఆరోపించారు. ధరల స్థిరీకరణకు రూ.4 వేల కోట్లతో  నిధిని ఏర్పాటు చేస్తామని రెండున్నరేళ్ల క్రితం చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు నిధులను ఎందుకు సమకూర్చలేదని ప్రశ్నించారు. అనంతరం ఎడ్లబండిపై తహసీల్దారు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 


అరకులోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర, తదితర నేతల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా వెళుతున్న నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మాడుగులలో మాజీ ఎమ్మెల్మే రామానాయుడు నేతృత్వంలో తహసీల్దారుకు వినతిపత్రం ఇవ్వడానికి ర్యాలీగా వెళుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. చోడవరంలో పార్టీ ఇన్‌చార్జి బత్తుల తాతబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు నిరసన తెలిపి, తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలోని మునగపాకలో టీడీపీ నేతలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితోపాటు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నప్పుడు పోలీసులు మైకు లాగేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు 35 మందిని అరెస్టుచేసి అనంతరం విడుదల చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని ఎస్‌.రాయవరం మండల కేంద్రంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వి.అనిత తదితరులను పోలీసులు అడ్డుకుని, ఆందోళనకు అనుమతి లేదని చెప్పారు. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇస్తామని చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో చినరాజప్ప, అనిత రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. 


అనకాపల్లిలో టీడీపీ నేతల ఆందోళనను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నెహ్రుచౌక్‌ వద్ద టీడీపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు భారీగా తరలివచ్చి పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, నియోజకవర్గం ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణతోపాటు ఇతర నాయకులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటి వద్ద నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ట్రాక్టర్‌పై బయలుదేరిన గిడ్డి ఈశ్వరి, ఇతర టీడీపీ నేతలను దారిలోనే పోలీసులు అడ్డుకుని, జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తులపై విడుదల చేశారు.


పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. పెందుర్తి కూడలి నుంచి తహసీల్దార్‌ కార్యలయం వరకు ట్రాక్టర్లపై ర్యాలీగా వచ్చారు. భీమిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో పద్మనాభంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ గాడు చిన్నికుమారి లక్ష్మి, జడ్పీటీసీ మాజీ సభ్యులు కె.దామోదరరావు, ఎస్‌.అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:39:15+05:30 IST