ఇసుకపై టీఢీపీ

ABN , First Publish Date - 2020-11-18T06:08:33+05:30 IST

అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి జిల్లా లోని ప్రభుత్వ ఇసుక డిపోల నుంచి 14 వేల టన్నులను అక్రమంగా తరలించి, సుమారు రూ.2 కోట్ల మేర స్వాహా చేశా రని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

ఇసుకపై టీఢీపీ
అనకాపల్లిలో గనుల శాఖ కార్యాలయానికి ర్యాలీగా వెళుతున్న అయ్యన్న, చలపతిరావు, నాగజగదీశ్వరరావు, ఇతర నేతలు

డిపోల్లో దోపిడీపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన

రూ.2 కోట్ల విలువచేసే 14 వేల టన్నుల ఇసుక స్వాహా చేసిందెవరో తేల్చాలని డిమాండ్‌

గనుల శాఖ అనకాపల్లి ఏడీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసేందుకు యత్నం

ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

జిల్లావ్యాప్తంగా నేతల గృహ నిర్బంధం, అరెస్టులు

అనకాపల్లిలో నిరసన ర్యాలీ

ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని అయ్యన్నపాత్రుడి ఆరోపణ


అనకాపల్లి, నవంబరు 17: అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి జిల్లా లోని ప్రభుత్వ ఇసుక డిపోల నుంచి 14 వేల టన్నులను అక్రమంగా తరలించి, సుమారు రూ.2 కోట్ల మేర స్వాహా చేశా రని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. డిపోల్లో మాయమైన ఇసు కకు సంబంధించిన వివరాలను గనుల శాఖ అధికారులు  వెల్లడించనందుకు నిరసనగా అయ్యన్నపాత్రుడు పిలుపు మేరకు పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ కమిటీ అధ్య క్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డు నుంచి గనుల శాఖ ఏడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి, అధికార పార్టీ నాయకులు అడ్డదారిన కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని ధ్వజమెత్తారు. అనకాపల్లిలో 4,400 టన్నులు, నర్సీపట్నంలో 2,020, ముడసర్లోవలో 2,160, అచ్యుతాపురంలో 1,500, అగనంపూడిలో 1,260, చోడవరంలో 760, భీమిలిలో 160 టన్నుల ఇసుక మాయమైందని, దీనిపై మైన్స్‌ అధికారులను వివరణ అడగ్గా...స్పందన లేదని, జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, మైన్స్‌ ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదని అయ్యన్న అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పక్కదారి పట్టిన ఇసుక విలువ రూ.2 కోట్ల వరకు వుంటుందని, ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ముఖ్యమంత్రి తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఇసుక అందుబాటులో లేకపోవ డంతో భవన నిర్మాణాలు నిలిచిపోయి రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. 


జిల్లాలో యథేచ్ఛగా మైనింగ్‌ దోపిడీ సాగుతున్నదని, ఎక్కడెక్కడ ఎంతెంత తవ్వుకుపోయారో చూపిస్తానని చెప్పారు. అక్రమార్కులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని, ఎవరెవరి నుంచి ఎంతెంత తీసుకుంటున్నారో తన వద్ద చిట్టా వుందని అయ్యన్న అన్నారు.   టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, ఎడ్ల బండ్లతో ఇసుక తీసుకువెళ్లి అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్న వారికి పాలసీ పేరుతో జీవనోపాధి లేకుండా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ, ప్రభుత్వ డిపోల్లో ఇసుక మాయంపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు గనుల శాఖ ఏడీ ప్రకాశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆడారి మంజు, పార్టీ నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, జోగినాయుడు, ఆళ్ల రామచంద్రరావు, పోలారపు త్రినాథ్‌, కొణతాల వెంకటరావు, దాడి ముసిలినాయుడు, డొక్కా నాగభూషణం, వెలగా మురళి తదితరులు పాల్గొన్నారు. 


కొద్దిసేపు గృహ నిర్బంధం

గనుల శాఖ కార్యాలయం ముట్టడికి తెలుగుదేశం నాయకులు పిలుపు ఇవ్వడంతో  పోలీసులు అప్రమత్తమయ్యారు. తొలుత అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, కోట్ని బాలాజీ, కొణతాల వెంకట సావిత్రి, తదితర నాయకులకు ‘హౌస్‌ అరెస్టు’ చేశారు. కొంతసేపటి తరువాత వీరిలో కొంతమందికి వెసులుబాటు ఇవ్వడంతో ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - 2020-11-18T06:08:33+05:30 IST