కక్షతోనే చేనేత సొసైటీలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2021-01-20T05:29:44+05:30 IST

చేనేతవర్గాలు తనకు ఓట్లు వేయలేదనే కక్షతోనే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేనేత సొసైటీలపై విజిలెన్స్‌ దాడులను చేయిస్తున్నారని, బీసీలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి పేర్కొన్నారు.

కక్షతోనే చేనేత సొసైటీలపై విజిలెన్స్‌ దాడులు
మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి

బీసీలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి

మంగళగిరి, జనవరి 19: చేనేతవర్గాలు తనకు ఓట్లు వేయలేదనే కక్షతోనే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేనేత సొసైటీలపై విజిలెన్స్‌ దాడులను చేయిస్తున్నారని, బీసీలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి పేర్కొన్నారు. చేనేతసొసైటీలపై జరుగుతున్న విజిలెన్స్‌ దాడులను ఖండిస్తూ మంగళవారం టీడీపీ నియోజకవర్గ  కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళగిరి ప్రాంతంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేనేత వర్గాలనే టార్గెట్‌ చేసుకుని కేసులు, విజిలెన్స్‌ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చేనేత పరిశ్రమకు కేవలం రూ.200 కోట్లు కేటాయించి ఆప్కో కొనుగోళ్లు, రుణాల సబ్సిడీలకు ఇస్తున్నారని,  చేనేత కార్మికులకు వ్యక్తిగతంగా ఉపయోగపడేలా ఇవ్వకపోగా చేనేత కార్మికులను ఉద్దరిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. చేనేత సొసైటీకి చెందిన ఏడెకరాల 40సెంట్ల భూమిని సొసైటీవారు అమ్ముకున్నారని ఎమ్మెల్యే అంటున్నారని,  ఆ సొసైటీ భూమిని ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ భూమి కాదని, చేనేత కార్మికులకు సంబంధించిన స్థలమని ఎమ్మెల్యే గ్రహించాలని హితవు పలికారు. ఇక ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యనందించిన సీకే హైస్కూల్‌పై, స్వీటు షాపులపై విజిలెన్స్‌ దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక వర్గాన్ని అణగదొక్కేలా పాలన చేస్తున్నారని, ఇదే కొనసాగితే  భవిష్యత్తులో చేనేత వర్గాలు, బీసీల వల్ల రాజకీయంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోకతప్పదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఊట్ల శ్రీమన్నారాయణ, కె.అంకమ్మరావు, టి. బాపనయ్య, పి.ప్రేమ్‌కుమార్‌, ఎం.రవికుమార్‌, వి.మైనర్‌బాబు, వి.సదాశివరావు, బి. శ్రీనివాసరావు, డి.మోహన్‌, షేక్‌ హుస్సేన్‌, వి.శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-20T05:29:44+05:30 IST