Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధినేతను కలవను

గోరంట్లతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న చినరాజప్ప, రామకృష్ణారెడ్డి.. (ఇన్‌సెట్‌లో) బుచ్చయ్యచౌదరి

  • ‘గోరంట్ల’ రాజీనామా అస్త్రం
  • టీడీపీలో కలకలం
  • చంద్రబాబు ఫోన్‌
  • ఇంటికొచ్చిన రాజప్ప, జవహర్‌, రామకృష్ణారెడ్డి, గన్ని కృష్ణ
  • రాజీనామా చేయరు : రాజప్ప
  • కార్యకర్తలకు సమస్యలున్నాయి: గోరంట్ల


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్త టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. గత ఎన్నికల్లో ఓడి, ఇప్పుడిప్పుడే బలోపేతమవుతున్న టీడీపీకి గోరంట్ల రాజీనామా చేస్తే గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టమనే చర్చ మొదలైంది. కానీ పార్టీ అధిష్ఠానం, పార్టీ వర్గాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అధినేత చంద్రబాబు నేరుగా ఫోన్‌ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. గోరంట్ల చెప్పివన్నీ విన్నారు. అన్ని పరిష్కరించుకుందాం.. రండి అని సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గోరంట్ల పార్టీలో సీనియర్‌. మంత్రిగా కూడా పనిచేశారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లో మంచి పట్టుంది. ఎప్పుడూ సిటీ నుంచే గెలిచే గోరంట్లను గత రెండు ఎన్నికల నుంచి రూరల్‌ నియోజకవర్గం నుంచి పార్టీ పోటీ చేయిస్తోంది.


పార్టీ తరపున సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఘాటైన పదజాలంలో విమర్శలు చేయడంలో దిట్ట. దేవినేని ఉమను అరెస్ట్‌ చేసి జైలుకు పంపినప్పుడు కూడా అండగా నిలిచారు. అటువంటి నేత ఆకస్మికంగా ఎందుకు అసంతృప్తికి గురయ్యారనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యుడిని చేసి గౌరవించింది. కానీ సిటీ రాజకీయాల్లో ఆయన జోక్యం ఉండడం లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మావగారు అప్పారావు, భర్త వాసు ఆధిపత్యమే ఉంది. సాధారణంగా ఎవరి నియోజకవర్గం వారిదిగానే ఉంటుంది. కానీ ఇక్కడ గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం వల్ల ఆయన అనుచరులైన సీనియర్లు సిటీలో ఉండిపోయారు. వారికి తగిన ప్రాధాన్యత లేదనే ఆందోళన ఆయనలో ఉంది.


ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఆయన వాసిరెడ్డి రాంబాబు, మరుకుర్తి రవియాదవ్‌, మజ్జి పద్మ, కొయ్యాన కుమారి, నక్కా రాజబాబు తదితర్లు పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. మహిళా నేతల పేర్లను మహిళా శాఖ అధ్యక్షురాలు అనితకు ఇవ్వగా, సిటీ నుంచి కాకుండా రూరల్‌ నుంచి పేర్లు ఇవ్వమని ఆమె సూచించినట్టు తెలిసింది. అంతేకాక మిగతా పేర్లను రాష్ట్ర కమిటీలోకి తీసుకోమని అచ్చన్నాయుడుకి చెప్పినా కాలేదనే బాధ ఆయనలో ఉండిపోయింది. ఈ విషయాలన్నీ చెప్పడానికి అధినేత చంద్రబాబుకు, నారా లోకేష్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ ప్రయత్నించినా స్పందించలేదని ఆయన ఆవేదన చెందినట్టు చెబుతున్నారు. దీంతో రెండు మూడు రోజుల నుంచి కార్యకర్తలను తన ఇంటికి రావద్దని చెప్పి, వారం రోజుల్లో పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సన్నిహితుల వద్ద ఆయన స్పష్టంచేశారు. దీంతో పార్టీలో కలకలం రేగింది.


అధిష్ఠానం వెంటనే అప్రమత్తమైంది. గోరంట్లను కలిసిన అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యుడు చినరాజప్ప మాట్లాడుతూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజీనామా చేయరని, కానీ నాలుగైదు రోజుల తర్వాత తామంతా చంద్రబాబు సమక్షంలో సమస్యను పరిష్కరించుకుంటామని వెల్లడించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్‌ రామకృష్ణారెడ్డి, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ ఆయనతో మాట్లాడారు.


కార్యకర్తల సమస్యలపై మాట్లాడుకోవాలి : గోరంట్ల

‘చంద్రబాబు మాట్లాడారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి రమ్మన్నారు. కానీ నేను వెళ్లను. ఇవాళ నాతో మాట్లాడడానికి వచ్చిన నేతలంతా వెళ్లి మాట్లాడి వస్తారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలకు సమస్యలున్నాయి. ఇవన్నీ మాట్లాడుకోవాలి. మీరు కంగారు పడకండి. ఏదైనా ఉంటే నేనే పిలిచి చెబుతానని ఈ సందర్భంగా గోరంట్ల చెప్పారు.


Advertisement
Advertisement