రైతులకు అండగా టీడీపీ

ABN , First Publish Date - 2020-10-28T11:30:25+05:30 IST

టీడీపీ ఎల్లపుడూ రైతులకు అండగా ఉంటుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు

రైతులకు అండగా టీడీపీ

రాష్ట్రంలో నియంత్రిత సాగుతో నిర్బంధ సాగు

సన్నరకాలకు రూ.2500 మద్దతు ధర చెల్లించాలి

టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ


జగిత్యాల, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎల్లపుడూ రైతులకు అండగా ఉంటుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనాకు సీఎం కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని, నియంత్రిత సాగు పేరుతో నిర్బంధ సాగుకు తెరలేపారని విమర్శించారు. వర్షాలతో పంటలు పూర్తిగా నాశనం అయ్యాయని, నియంత్రిత సాగు వల్ల రైతులకు పెట్టుబడి భారం పెరిగిందన్నారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, నిబంధనలు సడలించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.  సన్నరకాలకు రూ.2500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు.


ఓ వైపు పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా, హైదరాబాద్‌లో ప్రళయం ముంచుకు వచ్చినా కేసీఆర్‌ మాత్రం ప్రగతిభవన్‌, ఫాంహౌస్‌ నుంచి బయటకి రావడం లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌ను డల్లాస్‌గా చేస్తామని రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తామని, అలాగే నెదర్లాండ్‌ నిధులతో నాలుగు దిక్కుల నాలుగు హాస్పిటల్‌లు కట్టిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఒక్క పడక ఆసుపత్రి నిర్మించలేదన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుత కాలనీలు, బస్తీల తీరే కేసీఆర్‌ పాలనకు నిదర్శనం అన్నారు. ఉద్యమ సమయంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఊదరగొట్టిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే అన్ని వర్గాలను దూరం పెట్టారని, మిగులు రాష్ట్రాన్ని రూ.3లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాజకీయం గుత్తాధిపత్యంగా మారిందని, ఇది సమాజానికి అంత మంచిది కాదన్నారు. దుబ్బాక ఎన్నిక  విషయంలో ఎన్నికల కమిషన్‌ పూర్తి స్థాయిలో  విచారణ జరపాలని కోరారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న, జిల్లా కార్యదర్శి ఏలేటి సురేందర్‌, పట్టణ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌, నాయకులు వొల్లాల గంగాధర్‌, వనమాల నిరంజన్‌, కోరుకంటి రాము, పొట్టవత్తిని చక్రపాణి, పులి మల్లేశం గౌడ్‌, సంకోజు సుదర్శన్‌, అజ్గర్‌ ఖాన్‌ తదితరులున్నారు. సమావేశం అనంతరం ఇటీవలే మూడోసారి టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులై, తొలిసారి జగిత్యాలకు వచ్చిన ఎల్‌.రమణకు పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు,కార్యకర్తలు శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - 2020-10-28T11:30:25+05:30 IST