మళ్లీ విచారణకు రావాలంటే ఎలా వస్తా...పోలీసులతో కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2020-12-04T17:10:16+05:30 IST

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో విచారణకు వచ్చేందుకు మాజీ మంత్రి కొల్లురవీంద్ర నిరాకరించారు

మళ్లీ విచారణకు రావాలంటే ఎలా వస్తా...పోలీసులతో  కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో విచారణకు వచ్చేందుకు మాజీ మంత్రి కొల్లురవీంద్ర నిరాకరించారు. విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాంటూ శుక్రవారం ఉదయం రవీంద్ర ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అయితే ‘‘మళ్లీ విచారణకు రావాలంటే ఎలా వస్తాను...నేను ఒక మాజీ మంత్రిని, టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నత స్థానంలో ఉన్నా...సాధారణ వ్యక్తిలా మీరొచ్చి స్టేషన్‌కు రావాలంటే ఎలా..? ఘటనతో నాకు సంబంధం లేకున్నా గతంలో పోలీసులిచ్చిన సెక్షన్ 91 నోటీసులకు లిఖితపూర్వకంగా బదులిచ్చా..మళ్లీ నోటీసులివ్వండి.. నేను విచారణకు వస్తా’’ అంటూ రవీంద్ర స్పష్టం చేశారు. 


దీంతో ఇనగుదురు సీఐ శ్రీనివాస్ అప్పటికప్పుడు రవీంద్రకు మరోసారి నోటీసులు అందజేశారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు...రవీంద్ర ఇంటికి చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడిని కొనకళ్ల విచారణకు తప్పక సహకరిస్తామని స్పష్టం చేశారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని స్టేషన్‌కు పిలిచి విచారిస్తామనడం సరికాదన్నారు. ఇంటి వద్ద విచారణ చేయాలని.. పూర్తిగా సహకరిస్తామని కొనకళ్ల నారాయణరావు తెలిపారు. పోలీసులతో చర్చలు ముగిసిన అనంతరం వారు తిరిగి వెళ్లిపోయారు. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం వారం రోజుల్లో వివరణకు వస్తానని రవీంద్ర తెలియజేశారు. 

Updated Date - 2020-12-04T17:10:16+05:30 IST