టీడీపీ కర్నూలు జిల్లా రథసారథులు వీరే

ABN , First Publish Date - 2020-09-28T20:40:50+05:30 IST

తెలుగుదేశం పార్టీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. కొత్త నాయకత్వాన్ని..

టీడీపీ కర్నూలు జిల్లా రథసారథులు వీరే

కర్నూలుకు సోమిశెట్టి

నంద్యాలకు గౌరు వెంకట రెడ్డి

సమన్వయకర్తగా ప్రభాకర్‌ చౌదరి

నూతన ఒరవడికి టీడీపీ శ్రీకారం

లోక్‌ సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. టీడీపీలో ఇప్పటివరకు కొనసాగుతున్న జిల్లా స్థాయి కమిటీల స్థానే లోక్‌సభ నియోజకవర్గ కమిటీ విధానాన్ని ప్రారంభించారు. ప్రయోగాత్మక ఈ నిర్ణయం వెనుక అధినేత భారీ ప్రణాళికే రచించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్‌ సభ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను నియమించారు. 13  జిల్లాలకు 13 మంది సమన్వయకర్తలుగా కీలక నాయకులకు అవకాశం కల్పించారు.


కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా గౌరు వెంకటరెడ్డిని ఆదివారం ప్రకటించారు. అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరిని కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 


నూతనోత్తేజం..

జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపే విధంగా పలువురు నాయకులకు కమిటీల్లో అవకాశం కల్పించారు. ప్రధాన నాయకులతో సంప్రదింపులు జరిపిన తరువాతే ఈ కమిటీలను చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాకు చెందిన నాయకులను కర్నూలుకు నియమించిన విధంగానే కర్నూలు జిల్లా నాయకులైన ఎమ్మెల్సీ బీటీ నాయుడిని అనంతపురం, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కర్తగా నియమించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డిని ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయ కర్తగా అవకాశమిచ్చారు.


నూతన కమిటీ విధానంతో గ్రామస్థాయి కార్యకర్తలకు నాయకత్వం మరింత చేరువ చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి వీలయ్యే విధంగా కమిటీని సిద్ధం చేశారు. సామాజిక న్యాయం, సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూ అధ్యక్ష, సమన్వయకర్తలను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. 


బీసీకి ఆ రెండు జిల్లాల బాధ్యత

బనగానపల్ల్లె: ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయ కర్తగా బీసీ జనార్దన్‌ రెడ్డిని నియమిం చారు. చంద్రబాబుకు ఈ సందర్భంగా బీసీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.


అందరినీ కలుపుకుని వెళ్తాం

పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటా.

- గౌరు వెంకట రెడ్డి, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు 


కార్యకర్తల్లో ధైర్యం నింపుతా..

కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. పార్టీ బలోపేతానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి నన్ను కర్నూలు జిల్లాకు కేటాయించారని నమ్ముతున్నాను. కోట్ల, కేఈ తదితరులను సమన్వయం చేసుకుని ముందుకు నడుస్తాం. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేశాను. జిల్లాతో సత్సంబంధాలున్నాయి. పార్టీలో సమస్యలను పరిష్కరించుకుంటూ కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాం.

- ప్రభాకర్‌ చౌదరి, పార్టీ సమన్వయకర్త


ప్రజల్లోకి వెళతాం..

రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవ ర్గాలకు అధ్యక్షులను నియమించడానికి మా పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ ఆలోచన చేశారు. జమిలి ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తాం.

- సోమిశెట్టి, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు 

Updated Date - 2020-09-28T20:40:50+05:30 IST