జగన్ రెడ్డి పాలనలో రైతుల ఇళ్లలో చీకట్లు: Achenna

ABN , First Publish Date - 2021-10-27T16:59:13+05:30 IST

జగన్ రెడ్డి పాలనలో రైతుల ఇళ్లలో చీకట్లు కమ్ముకున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.

జగన్ రెడ్డి పాలనలో రైతుల ఇళ్లలో చీకట్లు: Achenna

అమరావతి: జగన్ రెడ్డి పాలనలో రైతుల ఇళ్లలో చీకట్లు కమ్ముకున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రైతు భరోసాలో అంకెల గారఢీతో అన్నదాతలను మోసం చేస్తున్నారన్నారు. నిన్న రైతు భరోసా పేరుతో ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రజలకు చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. నిన్న రైతు భరోసా కింద విడుదల చేసింది కేవలం రూ.30 కోట్లు మాత్రమే అని.. రూ.1213 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పడం రైతులను మోసం చేయడమే అని మండిపడ్డారు. ప్రజలను తప్పదారి పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


ఒకేదఫాలో రూ.12,500 ఇస్తామని హామి ఇచ్చి 3 దఫాల్లో రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రెండున్నరేళ్లలో సుమారు 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం చెల్తిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుకే సున్నా వడ్డీ పరిమితం చేస్తూ జీవో 464 విడుదల చేశారన్నారు. జగన్‌ పాలనలో వడ్డీని  రైతు.... బ్యాంకుకు ముందుగానే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం అటకెక్కిందని,  రైతు రథం పథకాన్ని రద్దు చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు యంత్ర సేవా పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. రైతుకు ఇప్పటి వరకు ఒక్క వ్యవసాయ యంత్ర పరికరాన్ని కూడా అందజేయలేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-27T16:59:13+05:30 IST