అమూల్‌కు ప్రమోటర్‌‌గా ప్రభుత్వం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-01-29T21:10:38+05:30 IST

రాష్ట్రంలోని పాడి రైతులను గాలికి వదిలేసి అమూల్‌కు ప్రమోటర్‌గా ప్రభుత్వం

అమూల్‌కు ప్రమోటర్‌‌గా ప్రభుత్వం: అచ్చెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలోని పాడి రైతులను గాలికి వదిలేసి అమూల్‌కు ప్రమోటర్‌గా ప్రభుత్వం మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పాడి రైతులకు ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం, అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంపై సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. పాడి రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. లీటర్‌కు రూ.4 బోనస్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పాడి రైతులను గాలికి వదిలేసి అమూల్‌కు ప్రమోటర్‌గా మారారన్నారు. అమూల్ పై చూపిస్తున్న శ్రద్ధ పాడి రైతులపై ఎందుకు చూపడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం అమూల్ కోసం దారి మళ్లిస్తున్నారన్నారు. అనంతపురం సభలో అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. రాష్ట్రానికి చెందిన డైయిరీలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమూల్ వల్ల లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనంగా లబ్ధి అనేది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన డైయిరీలను కాదని గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థకు ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోందన్నారు. అమూల్‌ సంస్థపై ఎందుకంత ప్రేమ అని ఆయన ప్రశ్నించారు. అమూల్‌ కోసం రూ.3 వేల కోట్లు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సహకార డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నారన్నారు. 




చిత్తూరు జిల్లాలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి పాల డైయిరీలో రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు పాలు కొంటున్నారని ఆయన తెలిపారు. శివశక్తి డైయిరీ లీటర్ కు రూ.18 మాత్రమే ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. లీటర్‌కు రూ.18 మాత్రమే చెల్లించి పాడి రైతుల రక్తాన్ని పీల్చుకున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా లీటర్ పాలకు రూ.18 చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సహకార డైయిరీలు, ఇతర సంస్థలను వదిలిపెట్టి బాలామృతం, అంగన్‌వాడీలకు పాల సరఫరాకు అమూల్‌తో ఒప్పదం చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఉన్మాద, కక్షసాధింపు చర్యలతో ఆయా డైరీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్నారు. సహకార డైయిరీలను పునరుద్ధరిస్తామనే ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-29T21:10:38+05:30 IST