గాలి కొచ్చిన వైసీపీ... అదే గాలికి కొట్టుకుపోవడం ఖాయం: బోండా ఉమ

ABN , First Publish Date - 2021-03-03T18:00:53+05:30 IST

ఎన్నికల ప్రక్రియను వైసీపీ అపహాస్యం చేస్తుందని టీడీపీ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గాలి కొచ్చిన వైసీపీ... అదే గాలికి కొట్టుకుపోవడం ఖాయం: బోండా ఉమ

విజయవాడ: ఎన్నికల ప్రక్రియను వైసీపీ అపహాస్యం చేస్తుందని టీడీపీ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో పోటీ చేయాలా ‌వద్దా అని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలకు పోలీసులే వంత పాడుతున్నారని ఆరోపించారు. దీని‌పై డీజీపీ, ఎన్నికల కమిషనర్, కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలా అయితే ఈ ఎన్నికలు ఎందుకు అని నిలదీశారు. పోలీసులు అధికారిక పార్టీ నేతలు‌ చెప్పినట్లుగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళలు ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారని... వారిని కూడా చెప్పలేని విధంగా దూషించడం దుర్మార్గమమని మండిపడ్డారు. పోలీసులు ఎదుటే దౌర్జన్యాలకు పాల్పడినా .. స్పందన లేదన్నారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పోలీసులు..  వైసీపీ గూండాలకు అండగా ఉంటున్నారని, తమ చర్యలతో  ఎన్నికలను అవసరమైతే బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు అయినా  చట్టపరంగా పోలీసులు నడిచేలా డీజీపీ చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. పోటీ‌ చేసే అభ్యర్ధులు ఓటర్ స్లిప్పులు పంపిణీ‌ చేయవచ్చని.. రూల్స్ తెలుసుకోకుండా పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.


వైసీపీ రౌడీలు వచ్చి... మహిళా అభ్యర్థులను‌ బెదిరిస్తారా అని ప్రశ్నించారు. బయటి ప్రాంతాల నుంచి రౌడీలను తెస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం  తాగించి మేపుతూ.. దాడులు‌ చేయిస్తారా అని అడిగారు. తమ ఇంట్లో ఆడవాళ్లు లేరా అని... అలాగే తిట్టిస్తారా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారులకు కొమ్ము కాస్తున్న వారు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. పాత బెజవాడనే చూడాలనుకుంటే...తాము దానికి కూడా సిద్ధమన్నారు. మధ్యాహ్నం మూడు గంటలలోపు విత్ డ్రా సమయం ఉందని, ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోదా అని ప్రశ్నించారు. ఇక్కడ పోటీ‌ చేస్తున్న అభ్యర్థులను పక్క రాష్ట్రంలో‌ దాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రచారంలో బౌన్సర్‌లను పెట్టుకుని రక్షణ కల్పించుకోవాల్సి వస్తుందన్నారు. స్వేచ్చాయుత‌ వాతావరణంలో ఎన్నికలు జరుపుతామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే..‌ ఈ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. గాలి కొచ్చిన వైసీపీ... అదే గాలికి కొట్టుకుపోవడం ఖాయమని బోండా ఉమా స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-03T18:00:53+05:30 IST