మందడం శిబిరానికి టీడీపీ అధినేత చంద్రబాబు

ABN , First Publish Date - 2020-12-04T19:05:31+05:30 IST

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మందడం శిబిరానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.

మందడం శిబిరానికి టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి: రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మందడం శిబిరానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అసెంబ్లీ నుంచి వెళుతూ మందడం శిబిరానికి వచ్చిన ఆయన అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న మహిళలు, రైతులతో మాట్లాడారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అరెస్టులకు భయపడకుండా మహిళలు చేస్తున్న పోరాటం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం కోసం తమ భూములను త్యాగం చేశారని... వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారని అన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి.. జగన్ ఇప్పుడు మోసం చేశారని బాబు మండిపడ్డారు. తన స్వార్థం కోసం అమరావతిని చంపాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. అయినా తమరంతా శాంతియుత ఉద్యమంతో అమరావతిని కాపాడుకుంటున్నారని కొనియాడారు. తమ త్యాగం, పోరాటం వృధా కావని... త్వరలోనే ఆనందకరమైన ప్రకటన వింటారని వారికి తెలిపారు.




ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు చేయిస్తుందని టీడీపీ అధినేత ఆరోపించారు. పోలీసులు కూడా చట్టానికి లోబడి పని‌ చేయాలని... ఇష్టం వచ్చిన విధంగా చేస్తే తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. అబ్దుల్ సలాం కేసులో సీఐ, కానిస్టేబుల్ బలి అయ్యారన్నారు. వెనుక ఉండి చేయించిన వారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని మండిపడ్డారు. తనకు అవమానాలు కొత్త కాదని.. తమ కోసం ఎన్ని అయినా తట్టుకుంటానని రైతులతో బాబు అన్నారు. సెంబ్లీలో, బయట కూడా ఇష్టం వచ్చినట్లు నోర్లు వేసుకుని పడుతున్నారని దుయ్యబట్టారు. బాంబులు, బుల్లెట్‌లనే తట్టుకున్న బాడీ ఇది అని... ఇలాంటి అవమానాలు తనని ఏమీ‌ చేయవని అన్నారు. అమరావతి సాధించుకునే వరకు అందరం కలిసి పోరాటాన్ని ముందుకు తీసుకెళదామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-04T19:05:31+05:30 IST