పోలీసుల వేధింపులతో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-11-15T01:01:16+05:30 IST

నెల్లూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో పట్టుకోసం అధికార పార్టీ నానాయాతలు పడుతోంది. ఏకగ్రీవాల కోసం మొన్నటివరకు ప్రత్యర్థి అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురాగా

పోలీసుల వేధింపులతో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

నెల్లూరు: నెల్లూరు నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో పట్టుకోసం అధికార పార్టీ నానాయాతలు పడుతోంది. ఏకగ్రీవాల కోసం మొన్నటివరకు ప్రత్యర్థి అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురాగా, నిన్న ఓటు కోసం వలంటీర్లను ప్రజల వద్దకు పంపారు. తాజాగా ప్రధాన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంలో కీలకంగా ఉన్న నాయకులపై వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, డబ్బులు పంచుతున్నారనే సాకుతో మరొకరిని రాత్రంతా పోలీస్‌స్టేషనులో ఉంచారు. వివరాల్లోకి వెళితే..  తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుస్టేషన్‌ ముందే ఆ ఘటన జరగటం నెల్లూరులో కలకలం రేపింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 49, 50 డివిజన్లకు శ్రీనివాసులు క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. 


మాజీ కార్పొరేటర్‌ కావడంతో ఆ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది.  దీంతో ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ వైసీపీ నేతలు కొన్ని రోజులుగా ఆయనను బెదిరిస్తున్నారు. అయినా, ఇవేవీ పట్టించుకోకుండా ఆయన టీడీపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆదివారం సంతపేట పోలీసులు ఆయనను  స్టేషన్‌కు పిలిపించారు. చాలా సేపు పోలీసు స్టేషన్‌లో ఉన్న శ్రీనివాసులు ఒక్కసారిగా నిద్రమాత్రలు మింగేసారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను హుటాహుటిన రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించటంతో, అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.



Updated Date - 2021-11-15T01:01:16+05:30 IST