Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజమౌళి సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఉంది: దాసరి శ్యామ్ చంద్రశేషు

జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): ఆగస్టు 13న జరిగిన ముప్పిడి రాజు హత్య కేసులో పోలీసులు, అధికారులు ఎట్టకేలకు ఒక వ్యక్తిని తీసుకువచ్చి అతనే హత్య చేశాడని, అది కూడా గేదెలు మిరప చేను తొక్కేసాయనే కోపంతో చంపేశాడని చెప్పడం రాజమౌళి సినిమా స్క్రిప్ట్ మాదిరి ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల సాధన ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు అన్నారు. ఈ మాత్రం దానికి ఇంత కాలయాపన చెయ్యాలా అని ఆయన ప్రశ్నించారు. 


‘‘గ్రామంలో ఒక సభ పెట్టుకుంటామని దళిత సంఘాలు, ప్రజాసంఘాలు అంటే బ్రిటిష్ రాజ్యంలో కూడా లేని విధంగా ఆంక్షలు అక్రమ నిర్భందాలా?. అసలు ఏమి చేస్తున్నారు, ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ఊపిరి ఆడక చనిపోతే శవం బయటకు తీసినప్పుడు ఎందుకు రక్తం, గాయాలు కనిపించాయి. నోట్లో నుంచి నురగ వచ్చింది. రైతు ఎందుకు పారిపోయాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలైన దోషులును అరెస్ట్ చేసి శిక్షించాలని  రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్ అలాగే రాష్ట్ర , జాతీయ ఎస్సీ కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేస్తాం’’ అని వెల్లడించారు. 


బీఎస్పీ నాయకుడు బఱ్ఱె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శాంతియుతంగా సమావేశం పెట్టుకుంటామంటే గృహ నిర్బంధం చేయడం అసలైన దోషులను వదిలేసి ఎవరో ఒకర్ని పెట్టి కేసు మమ అనిపించడం అత్యంత దారుణమన్నారు. ఎందుకు పోలీసు అధికారులు ఈ విధంగా చేస్తున్నారని మండపడ్డారు.  అసలైన దోషులను శిక్షించేవరకు పోరాటం ఆపేదిలేదన్నారు. 


ప్రియదర్శిని కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గొల్లమందల శ్రీను, కలపాల ప్రసాద్, తడికల మోహన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement