Abn logo
Sep 21 2021 @ 00:47AM

నేరాంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారా?

  ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 20: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.  రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో  సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాడు కావాలి కావాలి.. జగన్‌ అన్న వారే నేడు పో పో అంటున్నారని, ఛీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. హోంమంత్రిని అడ్డుపెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం చేస్తున్నారని, ఒక దళిత మహిళకు హోంశాఖ, డిప్యూటీ సీఎం ఇచ్చామని చెప్పి అఽధికారాలు విధులు లేకుండా చేశారన్నారు. తప్పుడు కేసులు, సెక్షన్లు బనాయించడంలో ప్రభుత్వం అగ్రగామిగా ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ప్రభుత్వాలు మారతాయి, పార్టీలు మారతాయనే సంగతి పోలీసు ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. దిశ అసలు చట్టమే కాలేదని, కేంద్రం అప్రూవల్‌ జరగలేదన్నారు. ఎంతమందికి  శిక్షలు వేశారో.. ఎవరికి ఉరిశిక్ష వేశారో చెప్పాలన్నారు.   వైసీపీ ప్రభుత్వం తీరుపై ప్రజా ఉద్యమాల ద్వారా బయటకి వస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని కోరారు. సమావేశంలో మార్ని వాసుదేవ్‌, మత్య్సేటి సత్య ప్రసాద్‌, మట్టా శ్రీను, సింగ్‌ సురేంద్ర, నరసింగ శ్రీను పాల్గొన్నారు.