వైసీపీ వైఫల్యంతో ఏపీ కరోనా కోరల్లో చిక్కింది: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-08-11T17:11:23+05:30 IST

వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతోందని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆరోపించారు.

వైసీపీ వైఫల్యంతో ఏపీ కరోనా కోరల్లో చిక్కింది: కళా వెంకట్రావు

అమరావతి: వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతోందని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రోజుకు 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నా.. ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కరోనా పుట్టిన చైనాలోని వుహాన్ నగరంలో కేసులు తగ్గినా ఆంధ్రప్రదేశ్‌లో తగ్గకపోవటం సిగ్గుచేటన్నారు. పొరుగు రాష్ట్రాలలో కేసులు తగ్గుతుంటే ఏపీలో మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


చంద్రబాబు నాయుడు హయాంలో నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా వెలుగులు విరజిమ్మితే... నేడు జగన్ హయాంలో కరోనాంధ్రప్రదేశ్‌గా మారిందని ధ్వజమెత్తారు. మద్యం షాపులు తెరిచి కరోనాకి రహదారులు పరిచారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ సమయంలో మద్యం విక్రయాలు సరికాదని డబ్ల్యూహెచ్‌వో చెప్పినా వినకుండా అదనంగా గంట సమయం పొడిగించి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రధేశ్ నిలిచిందని వ్యాక్యానించారు. యాక్టివ్ కేసులలో 87,112 కేసులతో దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నారు.  గత 10 రోజులలో ప్రతి రోజు కేసులు 6.16 శాతంతో, ప్రతిరోజు మరణాల పెరుగుదల 5.09 శాతంతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచిందని వ్యాఖ్యానించారు. 


దేశంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న 30 జిల్లాల జాబితాలో 9 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉండటం ప్రభుత్వ వైపల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో 8,500 కేసుల కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల జాబితాను పరిశీలిస్తే.. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే నూటికినూరు శాతం అన్ని జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయన్నారు. కరోనా కట్టడిలో, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సొంత పార్టీ నేతలే ఏకరువు పెడుతున్నారని ఆయన చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల నుంచి వేల రూపాయలు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. వైద్యం అందక రోగుల అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిస్ధితి ఈ విధంగా ఉంటే జగన్‌కు మాత్రం ప్రజల ప్రాణాలు గాలికొదిలి  మూడు రాజధానులు, మూర్ఖపు రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2020-08-11T17:11:23+05:30 IST