Abn logo
Sep 8 2021 @ 10:49AM

రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ ఉద్యమ బాట: kalva srinivasulu

అనంతపురం:  కేంద్రం జారీ చేసిన గెజిట్ వల్ల కృష్ణా జలాలు మృగ్యం అయిపోతున్నాయని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ ఉద్యమ బాట చేపట్టనుందని తెలిపారు. ఈ నెల11న రాయలసీమ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాయలసీమకు హంద్రీనీవా గాలేరు నగరి జీవనాడులన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లకు పైగా  ఖర్చు చేశామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల మొత్తం వ్యవస్థల మీద  పెత్తనం కేంద్రం పరిధిలోకి వెళ్లిందని... నష్టం అంతా ఇంతా కాదని ఆయన అన్నారు. ప్రచార యావతో రాయలసీమ భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తుగా హంద్రీనీవా కాలువ వెడల్పు ప్రదేశాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా మనుముడుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ప్రాజెక్టుల పనులు నిలిపివేశారన్నారు. రెండున్నర సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ప్రాజెక్టుల పరిస్థితి ఉందని అన్నారు. ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.