సీఎం జగన్ రాజీనామా చేయాలి: పట్టాభిరామ్

ABN , First Publish Date - 2021-05-11T17:52:13+05:30 IST

రుయా ఆసుపత్రి ఘటన అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

సీఎం జగన్ రాజీనామా చేయాలి: పట్టాభిరామ్

అమరావతి: రుయా ఆసుపత్రి ఘటన అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే రుయాలో మరణాలు సంభవించాయని ఆరోపించారు. అక్కడ మరణించినవారిని ముమ్మాటికీ ఈ ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందన్నారు. రుయాలో జరిగిన మరణాలు నూటికి నూరు శాతం ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యానించారు. హత్యానేరం కింద ముఖ్యమంత్రిపై, ఆరోగ్యశాఖా మంత్రి, అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. మృతులు బంధువుల ఆర్తనాదాలు, అక్కడి హృదయవిదారక దృశ్యాలు చూస్తుంటే, గుండె తరుక్కుపోతోందని తెలిపారు.


రాష్ట్రంలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మరణించడం ఇదే మొదటిసారి కాదన్నారు. అనంతపురం, విజయనగరం , హిందూపురంలో గతంలో మరణాలు సంభవించినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదని మండిపడ్డారు. ఆక్సిజన్ సరఫరాకు అన్నిఏర్పాట్లు చేశామన్న ముఖ్యమంత్రి, అధికారులు రుయా ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆక్సిజన్ పూర్తిగా అయిపోయేవరకు ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం ఎదురుచూడటమేంటని నిలదీశారు.  ఘటన జరిగిన మూడు గంటల వరకు ఎవరూ అటువైపు కన్నెత్తిచూడరా అంటూ పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-11T17:52:13+05:30 IST