Abn logo
Sep 23 2021 @ 14:26PM

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై మండిపడ్డ ఎమ్ఎస్ రాజు

అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌ఎస్ రాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గిరాల ఎంపీపీ స్థానం కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే... జగన్ మార్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీకి దక్కాల్సిన ఎంపీపీ స్థానాన్ని, పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో వైసీపీ పరంచేయడానికి సిద్ధమయ్యారన్నారు. రేడియోలు, టీవీల్లో నీతి ప్రవచనాలు చెప్పే ఆర్కే... వాస్తవంలో మాత్రం గూండాలు, రౌడీలతో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 18 ఎంపీటీసీలకు గాను 14 స్థానాలకు ఎన్నికలు జరిగితే దుగ్గిరాల మండలంలో 9 స్థానాల్లో టీడీపీ విజయం సాధించిందని తెలిపారు. స్థానిక ఎమ్మార్వో, ఎమ్మెల్యే ఆదేశాలతో గెలిచిన టీడీపీ అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదన్నారు. గెలిచిన అభ్యర్థులకు 24 గంటల్లో ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఎమ్మార్వోకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకొనే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ 90 స్థానాల్లో గెలిచిందని ఆరోపించారు. కానీ ముఖ్యమంత్రేమో దేవుడి ఆశీస్సులు, ప్రజాబలం అంటూ కబుర్లు చెబుతున్నారన్నారు. దుగ్గిరాల ఎంపీపీ టీడీపీకి దక్కకపోతే, అక్కడి అభ్యర్థులు న్యాయపోరాటం చేసైనా సరే ఆర్కేకు బుద్ధివచ్చేలా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.  దుగ్గిరాల ఎంపీపీ ఫలితమే  భవిష్యత్‌లో మంగళగిరి నియోజకవర్గంలోనూ పునరావృతమయ్యేలా చేయడానికి అక్కడి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఎమ్‌ఎస్ రాజు తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption