‘ప్రభుత్వమే యువతను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేస్తోంది’

ABN , First Publish Date - 2021-10-18T18:38:49+05:30 IST

ప్రశ్నించే గొంతులు మూగబోయేలా చేస్తూ ప్రభుత్వమే యువతను మాదకద్రవ్యాలకు బానిసల్ని చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు.

‘ప్రభుత్వమే యువతను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేస్తోంది’

అమరావతి: ప్రశ్నించే గొంతులు మూగబోయేలా చేస్తూ ప్రభుత్వమే యువతను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. అక్రమార్జన, దోపిడీ కోసం అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముఖ్యకేంద్రంగా మార్చారన్నారు. హెరాయిన్ దిగుమతులపై విజయవాడలో ఎన్ఐఏ సోదాలు జరిపే వరకు ఏపీ పోలీస్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీలో గంజాయిపై తెలంగాణ పోలీసులు దాడి చేసే వరకు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.


గంజాయి సాగు, అక్రమ రవాణాకు ప్రభుత్వ సహాయ సహకారాలుండబట్టే ఏపీ పోలీస్ శాఖ చేష్టలుడిగి చూస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి అనుచరులే ఓపీఎమ్‌లో వినియోగించే ముడిపదార్థాలు సాగు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సాగవుతున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాల ముడిపదార్థాల సాగు, రవాణా, విక్రయాలన్నీ అధికార పార్టీ అండతోనే సాగుతున్నాయన్నారు. కేంద్ర నిఘా సంస్థలు, మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగాలు తక్షణమే ఏపీపై దృష్టి సారించాలని హితవుపలికారు. గంజాయి, మాదకద్రవ్యాల ముడిపదార్థాల సాగు, ఇతర వ్యవహారాల్లో తలమునకలైన వారి ఆటకట్టించాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-18T18:38:49+05:30 IST