Abn logo
Sep 27 2021 @ 02:45AM

‘తెలంగాణ సరిహద్దులో పట్టుబడింది ఆ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడే..’

గంజాయితో పట్టుబడింది విప్‌ సామినేని కుమారుడే

ఇరు రాష్ట్రాల సీఎంలు మంతనాలు జరిపారు

ప్రశాంత్‌ని తప్పించారు.. సంబంధం లేనివారిని ఇరికించారు

నర్సీపట్నం ఎమ్మెల్యే గణేశ్‌ గాంజా వ్యాపారం చేస్తున్నారు: పట్టాభి


అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘డ్రగ్స్‌ పుట్టలోంచి వైసీపీ విషసర్పాలు బయటికొస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు ప్రశాంత్‌ 60 కిలోల గంజాయితో తెలంగాణ సరిహద్దులో పట్టబడ్డారు. రెండు రాష్ట్రాల సీఎంల ఇళ్లలో మంతనాలు జరిగాయి. దీంతో ఆ కేసులో వేరేవారిని పెట్టారు. ఉదయభానుకు ధైర్యముంటే తన కుమారుడిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తీసుకొచ్చి రక్త, వెంటుక్రల పరీక్షలు నిర్వహించనీయాలి’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం సవాల్‌ చేశారు. ఆయన ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. వైసీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే గౌరీశంకర్‌ గణేశ్‌ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు. కాగా, తన అవినీతి, అక్రమార్జన కోసం సీఎం జగన్‌ రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్‌గా మార్చి, యువతను మత్తులో ముంచి తేలుస్తున్నాడని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ధ్వజమెత్తారు.