కరోనా నిధులను ఎవరికి దోచిపెట్టారు? : పట్టాభి

ABN , First Publish Date - 2021-05-18T17:35:14+05:30 IST

సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు.

కరోనా నిధులను ఎవరికి దోచిపెట్టారు? : పట్టాభి

అమరావతి: సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకు దాని కోసం ప్రభుత్వం రూ.2,229కోట్లు ఖర్చుచేసిందని.. ఈ లెక్కలు ముఖ్యమంత్రి సొంత పత్రిక సాక్షిలోనే రాశారని తెలిపారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం రూ.934కోట్లన్నారు. మందులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకు రూ.2075కోట్లు ఖర్చుపెట్టినట్టు రాశారని చెప్పారు. రూ.2,294కోట్లలో రూ.2075కోట్లు పోతే, ఇక ఆసుపత్రుల్లో సౌకర్యాలకు ఏం ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు,  ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు సున్నా అని విమర్శించారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు,  ఐసీయూ పడకలు లేక ప్రజలు చనిపోతున్నా కూడా ఈ ముఖ్యమంత్రి  వాటికి రూపాయి కూడా ఖర్చుచేయలేదని ఆయన మండిపడ్డారు. మరోపక్క జీతాలకు రూ.900కోట్లు అయితే, జీతాల కోసం ప్రంట్ లైన్ వారియర్లు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు ఎందుకు చేశారని నిలదీశారు. ఈ ముఖ్యమంత్రి జీతాలు, మందుల పేరుతో కరోనా నిధులను ఎవరికి దోచిపెట్టారని ప్రశ్నించారు.


మరోపక్క ల్యాబోరేటరీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నయాపైసా ఖర్చుపెట్టలేదన్నారు. రాష్ట్రంలో ల్యాబోరేటరీల సంఖ్యను విపరీతంగా పెంచామని సాక్షిలో రాశారన్నారు. రాష్ట్రంలో మొత్తం ల్యాబోరేటరీలు 126 ఉంటే, ప్రభుత్వ లేబోరేటరీలు కేవలం 79 మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఏపీలో 126 ఉంటే, కేరళలో 160 ఉన్నాయన్నారు. 126 ల్యాబోరేటరీల్లో ట్రూనాట్ ల్యాబ్‌లను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. కొత్తగా ఈ ముఖ్యమంత్రి ఎక్కడా ఒక్క ల్యాబోరేటరీ కూడా పెట్టలేదని తెలిపారు. మందులు, జీతాల పేరుతో కేంద్ర ప్రభుత్వమిచ్చిన నిధులన్నీ ఈ ముఖ్యమంత్రి మింగేశాడని ఆరోపించారు. కోవిడ్ తొలిదశలో టెస్ట్ కిట్ల పేరుతో, రెండోదశలో జీతాలు, మందుల పేరుతో ముఖ్యమంత్రి మొత్తం మింగేశాడని సాక్షిలో రాసిన లెక్కలే చెబుతున్నాయని పట్టాభి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-05-18T17:35:14+05:30 IST