జగన్ రూ.43 వేల కోట్ల అవినీతి సంపద ప్రజాపరం చేయాలి: యనమల

ABN , First Publish Date - 2021-06-24T16:28:45+05:30 IST

జప్తు చేసిన జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

జగన్ రూ.43 వేల కోట్ల అవినీతి సంపద ప్రజాపరం చేయాలి: యనమల

అమరావతి: జప్తు చేసిన జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. మాల్యా, నీరప్ మోదీ, చాక్సీ ఆస్తులు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వపరం చేశారన్నారు. సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొన్న జగన్ రూ.43 వేల కోట్ల అవినీతి సంపద ప్రజాపరం చేయాలని అన్నారు. జగన్ ఆర్థిక నేరాలకు అతని అఫిడవిటే అద్దం పట్టిందని వ్యాఖ్యానించారు. 47 పేజీల జగన్ అఫిడవిట్‌లో 18 పేజీలు ఆర్థిక నేరాల చిట్టానే ఉందన్నారు. డొల్ల కంపెనీలు పెట్టి నిధుల సమీకరణ, మనీలాండరింగ్ నేరాల్లో ఈ ముగ్గురితో జగన్ పోటీ పడుతున్నారన్నారు. 108 మంది వ్యక్తులు, 100 కు పైగా కంపెనీలు, నలుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, ఐదుగురు ఉన్నతాధికారుల గూడుపుఠాణి అని ఆయన తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం "జగన్ క్విడ్ ప్రొక్వో" అవినీతి అని అన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా జగన్ ఆర్థిక నేరాల చిట్టాలు ఉన్నాయని చెప్పారు.  5 ఏళ్లలోనే 11008 కోట్ల అవినీతి సంపద పెరగడం, రూ.10 షేర్‌ను రూ.1440 కు అమ్మడం ఎలా సాధ్యమని యావత్ ప్రపంచం విస్తుపోయిందన్నారు.


ఆర్థిక నేరం హత్య కంటే ప్రమాదకరమని గతంలోనే సుప్రీంకోర్టు హెచ్చరించిందని గుర్తుచేశారు.  జగన్ ఆర్థిక నేరాల విచారణలో ఏళ్ల తరబడి జాప్యం గర్హనీయమని మండిపడ్డారు.  ఇంకా జప్తు చేయని జగన్ అవినీతి సంపదను కూడా వెంటనే జప్తు చేయాలని డిమాండ్ చేశారు. జప్తు చేసిన దాదాపు రూ.10 వేల కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలన్నారు. బ్యాంకులకు మోసం చేసిన సొమ్ము బ్యాంకుల పరం చేసినట్లే, ప్రజలను మోసం చేసిన సొమ్ము ప్రజల పరం చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-24T16:28:45+05:30 IST