న్యాయవ్యవస్థపైనే నిందితుల దాడి ఆందోళనకరం: యనమల

ABN , First Publish Date - 2020-11-22T17:11:15+05:30 IST

న్యాయవ్యవస్థపైనే నిందితుల దాడి ఆందోళనకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

న్యాయవ్యవస్థపైనే నిందితుల దాడి ఆందోళనకరం: యనమల

అమరావతి: న్యాయవ్యవస్థపైనే నిందితుల దాడి ఆందోళనకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.  సుప్రీంకోర్టు సీజేకు జగన్ రెడ్డి లేఖను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. న్యాయమూర్తులంతా ఏకతాటిపై నిలిచి దీనిని ఖండించాలని కోరారు. ఏకతాటిపై లేకపోతే, నిందితులంతా ఇవే పోకడల్లో పోతారని..ప్రతి నిందితుడూ ఇకపై న్యాయవ్యవస్థను బెదిరిస్తారని తెలిపారు. తొలినుంచి న్యాయమూర్తులను టార్గెట్ చేస్తున్న జగన్ రెడ్డి, ఆయన అనుచరులు కూడా అదే పెడ పోకడల్లో పోతున్నారని మండిపడ్డారు. కోర్టుల ముందు ట్రయల్స్‌లో జగన్ రెడ్డిపై 31 కేసులు ఉన్నాయన్నారు. ట్రయల్స్ నేపథ్యంలోనే జగన్ రెడ్డి లేఖ రాశారని ఆయన తెలిపారు. 


నిందితులే న్యాయవ్యవస్థను బెదిరించడం నిత్యకృత్యం కారాదని సూచించారు. ప్రశాంత్ భూషణ్‌పై స్పందించినట్లే, జగన్ రెడ్డి లేఖను సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.  ఇదే పెడ పోకడ ప్రతిఒక్కరూ పోతే, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికే ప్రమాదం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలు మంటగలుస్తాయన్నారు. నిందితులే అత్యున్నత న్యాయమూర్తులను బెదిరిస్తే, ఇక దిగువ కోర్టులు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు. వెలుపలి బెదిరింపుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే అని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-11-22T17:11:15+05:30 IST