మాటలు పేదలకు... మూటలు వైసీపీ నేతలకు: యనమల

ABN , First Publish Date - 2021-06-14T17:20:05+05:30 IST

అవినీతిపరుల రాజ్యంలో మాటలు పేదలకు, మూటలు వైసీపీ నేతలకు దక్కుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

మాటలు పేదలకు... మూటలు వైసీపీ నేతలకు: యనమల

అమరావతి: అవినీతిపరుల రాజ్యంలో మాటలు పేదలకు, మూటలు వైసీపీ నేతలకు దక్కుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ధనవంతులు మరింత ధనికులవుతుంటే, పేదల పరిస్థితి దిగజారిందని అందుకు కారణం కరోనా అని ప్రభుత్వం చెప్పడం అబద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాలన్నీ పేదరికం పరిధిలోకి వచ్చాయని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఆయన అనుచరులు, పార్టీవారు కొత్తగా ధనవంతులయ్యారని యెద్దేవా చేశారు. విద్య, వైద్య రంగాలకు మిగతా రాష్ట్రాలు చేస్తున్న కేటాయింపులతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువన్నారు. కొవిడ్ సమయంలో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి వర్గాలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమని ఆయన విమర్శించారు. కేరళ ప్రభుత్వం తొలిదశలో రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, జగన్ ప్రభుత్వం మాత్రం పేదలు, మధ్యతరగతి వర్గాలపై నిత్యావసరాలు, పెట్రోల్-డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీల భారం వేసిందన్నారు. పేదరికంతో , ఆర్థిక అసమానతలు పెరుగుతున్నా వాటి నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు.


ప్రజలకు రూపాయి ఇస్తున్నది భూతద్దంలో చూపుతూ, సహజవనరుల దోపిడీని పెద్ద ఎత్తున చేస్తున్నారని ఆరోపించారు. గ్రామస్థాయి నుంచి అవినీతి విచ్చలవిడిగా జరుగుతున్నా, జగన్ అవినీతిపరుడు కాబట్టే దాన్నికట్టడి చేయడంలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైసీపీ నేతలు, కార్యకర్తల ఆస్తులు ఎంత పెరిగాయో చెప్పాల్సిన పనిలేదని అంబేద్కర్ సూచించిన సామాజిక న్యాయం ఈ ప్రభుత్వంలో ఎక్కడాఅమలవడంలేదన్నారు. లబ్ధిదారులకు (ప్రజలకు) నగదు బదిలీ అనేది టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభమైందని తెలిపారు. 2004కు ముందు, కొన్ని నిబంధనలను అనుసరించి, ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం అమలు చేశామని ఆయన  చెప్పారు. 16 రాష్ట్రాలు నేరుగా నగదు బదిలీని అమలు చేస్తున్నాయని... కానీ వాటితో పోలిస్తే, ఏపీలో ప్రజల తలసరి ఆదాయం దారుణంగా పడిపోయిందన్నారు.


2019-20లో నగదు బదిలీ కింద రూ.27,710కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పారని...టీడీపీ ప్రభుత్వం 17సంక్షేమ పథకాలకు రూ.18వేలకోట్ల వరకు ఖర్చుపెట్టిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రద్దు చేసి, కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చిందేమీలేదన్నారు. బడ్జెట్లో చేస్తున్న కేటాయింపులకు, ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ లెక్కలకు పొంతన ఉండటంలేదని తెలిపారు. ఏడాదికి పది లక్షల ఇళ్లు కడతామంటున్నారని.. అసలు ఇప్పుడున్న ప్రభుత్వానికి, గృహ నిర్మాణశాఖకు అంత సామర్థ్యం ఉందా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-14T17:20:05+05:30 IST