ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-03-02T08:33:08+05:30 IST

చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు మండిపడ్డారు. పలుచోట్ల

ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ఎన్నికల కమిషనర్‌ వెంటనే స్పందించాలి

చిత్తూరు ఎస్పీ క్షమాపణలు చెప్పాలి: అచ్చెన్న

జగన్‌ క్రూరత్వానికి నిదర్శనమిది: యనమల


విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు మండిపడ్డారు. పలుచోట్ల నాయకులు, పార్టీ శ్రేణులు నిరసన లు వ్యక్తం చేశాయి. గ్రామాలు, వార్డుల్లో వైసీపీ నేతలు, కార్యకర్తల ఊరేగింపులు, సభలకు అనుమతిస్తున్న పోలీసులు... విపక్ష నేత హోదాలో సొంత జిల్లాకు వెళితే ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయు డు శ్రీకాకుళంలో ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో తమ పార్టీ అభ్యర్థులకు బెదిరింపులు రావడంతో కలెక్టర్‌, ఎస్పీని కలవడానికి బయలుదేరిన చంద్రబాబును ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. విశాఖపట్నంలో ఒక బ్రోకర్‌ పాదయాత్రలు చేసినప్పుడు ఎందుకు పోలీసులు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. రేణిగుంట ఘటనపై చిత్తూరు ఎస్పీ క్షమాపణలు చెప్పి చంద్రబాబు పర్యటన సాగేలా చూడాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఏదైనా ఫిర్యాదు చేస్తే పోస్ట్‌మెన్‌లా కలెక్టర్లకు పంపిస్తున్నారని ఆరోపించారు.


రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు రాజాంలో విమర్శించారు. ఎన్నికలను హింసాత్మకం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఒక జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని కలవాలంటే అందుకు సీఎం జగన్‌ అనుమతి తీసుకోవాలా!? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో నిరసన తెలపకూడాదని రాసిపెట్టారా? అని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు వద్ద మహిళా నేత ఉషారాణిని తోసి ఉగ్రవాదులు, రౌడీషీటర్ల మాదిరిగా తీసుకెళ్లడం బాధాకరమన్నారు.‘జగన్‌ పాలనలో ప్ర జాస్వామ్యం అపహాస్యమవుతోంది. 32 క్రిమినల్‌ కేసులున్న వ్యక్తి బెయిల్‌పై బయటకు వచ్చి సీఎం అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అటకెక్కుతుందనడానికి నిదర్శనమే రేణిగుంట  సంఘటన’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అనేదే లేదని బొండా ఉమా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని మాజీ మంత్రి దేవినేని ఉమాధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే చంద్రబాబును ప్రజల్లో తిరగనీయకుండా తుగ్లక్‌ జగన్‌ అడ్డుకుంటున్నాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ట్వీట్‌ చేశారు. ఎయిర్‌పోర్టు ఘటనపై ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నిలదీశారు. బాబుని చూస్తే.. వైసీపీ వాళ్లకి వణుకొస్తోందని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. జగన్‌రెడ్డి పులివెందుల పిల్లి అని మాజీ మం త్రి జవహర్‌ ఎద్దేవా చేశారు.


ప్రతిపక్ష నేతను అడ్డుకోవడమెందుకు?: బుద్దా

‘‘ప్రజాబలం ఉంటే ప్రతిపక్ష నేతను అడ్డుకోవాల్సిన పనేంటి జగన్‌రెడ్డి? ప్రజలంతా మా వైపే అని ఎంత షో చేసినా, అధికారులను అడ్డుపెట్టుకొని ఎన్ని ఏకగ్రీవాలు చేసుకున్నా పిరికిపంద చర్యలతో ఓటమిని అంగీకరిస్తారు’’ అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్‌ చేశారు. కాగా, కరోనా ఆంక్షలు కేవలం టీడీపీ పార్టీకి.. చంద్రబాబుకు మాత్రమే వర్తిస్తాయా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇదే తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఒక రోజు ముందు ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తే ఎందుకు ఆపలేదన్నారు. 


బాబుకు నోటీసుపై ఈసీ అనుమతి తీసుకొన్నారా?: యనమల

‘‘టీడీపీ అధినేత చంద్రబాబును చిత్తూరు పర్యటనకు అనుమతించాలా? వద్దా? అన్నది ఎన్నికల కమిషన్‌ పరిధిలోని అంశమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. అదే నిజమైతే ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండా చంద్రబాబుకు పోలీసులు సెక్షన్‌ 30 కింద నోటీసు ఎలా ఇస్తారు? ఈసీ ఆదేశాలు లేకుండా ఆయనను విమానాశ్రయంలో ఎలా నిర్బంధిస్తారు?’’ అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పోలీసుల దమన చర్యకు, ఎన్నికల కమిషన్‌కు ఏ సంబంధం లేకపోయినా దానిపై నెట్టి తప్పించుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది కేవలం జగన్‌ ప్రభుత్వ క్రూరత్వమని యనమల విమర్శించారు.్ఙ

Updated Date - 2021-03-02T08:33:08+05:30 IST