బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్ పదవులు ఏవి?: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-06-12T17:01:23+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్, డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్ పదవులు ఏవి?: టీడీపీ నేతలు

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్, డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి దళితుల్ని దగా చేస్తూ,  సొంత సామాజిక వర్గానికి దొడ్డిదారిన పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రిటైర్డ్ అయిన సుబ్బారెడ్డిని పంచాయతీ రాజ్ శాఖలో  నిబంధనలకు  విరుద్ధంగా  ఇంజనీర్-ఇన్-చీఫ్ పదవిని కట్ట బెట్టారని మండిపడ్డారు. సీనియారిటీ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంజనీర్లను పక్కన్న పెట్టి రెడ్డి కులానికి ఎక్కడ లేని అధికారాలను కట్టబెడుతూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులాలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఏవి? అని ప్రశ్నించారు. వర్షాకాలంలో చెరువులన్నీ నీటితో నిండినట్టు, వైసీపీ పాలనలో నామినేటేడ్ పోస్టులన్నీ జగన్ సొంత సామాజికవర్గంతో నిండిపోయాయని వ్యాఖ్యానించారు.


వైసీపీకి కులమే ఊపిరిగా మారిందన్నారు. ఇలాంటి పెడదొరణి ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమన్నారు. రిటైర్డు అయిన వారికి అడ్డగోలుగా పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ఎన్ఆర్ఈజీఎస్ నిధుల వినియోగంలో ఇంజనీర్-ఇన్-చీప్ కీలక భాద్యతలు పోషిస్తారని... ఆ నిధులను అడ్డగోలుగా మళ్లించుకోవడానికి ఇలా అడ్డదారిన రెడ్డి సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దళిత ఇంజనీర్లకు అన్యాయం చేయడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక భూమిక పోషించారన్నారు. వైసీపీ పాలనలో దళితులు అడగడుగునా అన్యాయానికి  గురవుతున్నారని, ఇకనైనా దళితులు జగన్ రెడ్డి మోసాన్ని గ్రహించాలని అనగాని సత్య ప్రసాద్, డోలా బాల వీరాంజనేయస్వామి హితవుపలికారు.

Updated Date - 2021-06-12T17:01:23+05:30 IST