నానిని అరెస్టుచేసేదాకా పోరాటం

ABN , First Publish Date - 2022-01-26T09:03:42+05:30 IST

గుడివాడ కేసినో వ్యవహారంలో ప్రమేయం ఉన్న మంత్రి కొడాలి నాని అరెస్టు జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ అంశంపై ఆ పార్టీ నియమించిన నిజ

నానిని అరెస్టుచేసేదాకా పోరాటం

కేసినో నిర్వహణలో ఆయన ప్రమేయం

జాతీయ దర్యాప్తు సంస్థలకు విచారణ బాధ్యత అప్పగించాలి

గవర్నర్‌ను కలిసి కోరదాం: టీడీపీ


అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గుడివాడ కేసినో వ్యవహారంలో ప్రమేయం ఉన్న మంత్రి కొడాలి నాని అరెస్టు జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ అంశంపై ఆ పార్టీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారమిక్కడ తమ పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. కేసినో నిర్వహణ, అందులో మంత్రి ప్రమేయం తదితర అంశాలపై తాము సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో ఆయనకు అందజేశారు. కరోనా వచ్చిన తగ్గిన తర్వాత చంద్రబాబు మొదటిసారి ఈ కమిటీతోనే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణరావు, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత పాల్గొన్నారు. మంత్రి ప్రమేయం ఉన్నందున విచారణను జాతీయ దర్యాప్తు సంస్ధలకు అప్పగించాని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. బుధవారం గణతంత్ర దినోత్సవం అయినందున గురువారం ఆయన్ను కలిసే అవకాశం ఉంది. దీని తర్వాత పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్ధలకు నేరుగా వినతిపత్రాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో గుడివాడలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. స్ధానికంగానూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిశ్చయించారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. చట్టాలను అతిక్రమించి తన సొంత స్థలంలో మూడ్రోజులపాటు కేసినో నడిపించిన మంత్రి కొడాలి నాని జైలుకు వెళ్లేవరకూ తమ పోరాటం ఆపేది లేదని వర్ల రామయ్య అన్నారు.

‘కేసినో నిర్వహణతో రూ.వందల కోట్లు ఆర్జించారు. రూ.50 వేలు ప్రవేశ రుసుమే పెట్టారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడకు పోయిందో తేలాలి. ఈడీ, డీఆర్‌ఐ, నిఘా, ఐటీ వంటి సంస్ధలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. మా పోరాటంతో న్యాయం జరగకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం’ అని చెప్పారు. తాను గుడివాడలో పోలీసు అధికారిగా పనిచేసినప్పుడు నానిని ఎన్నిసార్లు కొట్టానో... బూటు కాలితో తన్నానో ఇప్పుడు చెప్పడం భావ్యం కాదని, ఆ రోజుల్లో రోడ్‌ సైడ్‌ రోమియోగా ఉన్న అతడి ఆర్థిక స్థాయి అప్పుడేమిటో.. ఇప్పుడేమిటో గుడివాడలో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బుద్దా వెంకన్న తిట్టాడని అరెస్టు చేసిన పోలీసులు అంతకంటే భయంకరమైన తిట్లు మంత్రి నాని తిడితే ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశ్నించారు.

Updated Date - 2022-01-26T09:03:42+05:30 IST