జూదాంధ్రగా మారుస్తున్నారు

ABN , First Publish Date - 2022-01-18T05:32:10+05:30 IST

జూదాంధ్రగా మారుస్తున్నారు

జూదాంధ్రగా మారుస్తున్నారు
ఎస్పీకి వినతిపత్రం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

గుడివాడలో జూదం ఆడించిన మంత్రి కొడాలి నానీని బర్తరఫ్‌ చేయాలి : టీడీపీ డిమాండ్‌ 

ఎస్పీకి వినతిపత్రం సమర్పించిన జిల్లా నాయకులు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 17 : ఆంధ్రప్రదేశ్‌ను జూదాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను సోమవారం కలిసిన టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, బొండా ఉమా మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సంప్రదాయాల పండుగ అని, ఎప్పుడూ లేని విధంగా మొదటిసారిగా గోవా, బ్యాంకాక్‌, అమెరికాలో జరిగే అకృత్య విధానాలను గుడివాడలోని మంత్రి కొడాలి నాని కన్వెన్షన్‌ సెంటర్‌లో విచ్చలవిడిగా ఆడించారన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గుడివాడలో జరిగిన సంఘటనల వీడియోలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు అందజేశామన్నారు. సంక్రాంతి పేరుతో గుడివాడలో క్యాసినో కల్చర్‌ తీసుకొచ్చిన మంత్రి కొడాలి నానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశామన్నారు. గుడివాడలో రూ.500 కోట్లతో జూదం జరిగిందని చెప్పారు. జిల్లాలో మద్యం ఏరులై పారిందని, విచ్చలవిడిగా జూద గృహాలు, కోడిపందేలు నిర్వహించారన్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గోవా డ్యాన్సర్లను తీసుకొచ్చి విచ్చలవిడిగా అరాచకాన్ని సృష్టించారన్నారు. కొడాలి నానీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా మాట్లాడుతూ జిల్లాలో గుడివాడ, తదితర ప్రాంతాల్లో జరిగిన జూదం, కోడి పందేలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పోలీసులే మఫ్తీలో గుడివాడలో జరిగిన క్యాసినో కార్యక్రమాలకు రక్షణ కల్పించడం ఆశ్చర్యకరమన్నారు. ఇంతా జరుగుతున్నా గుడివాడ డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు తెలియదా.. అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ జిల్లా అంతటా పేకాట, కోడి పందేలు నిర్వహిస్తున్నా అరెస్టులే లేవన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ గుడివాడలో జరిగిన జూదం జగన్‌ మీడియాకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పామర్రు ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా, టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇలియస్‌ బాషా, పీవీ ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర పరువు తీసిన బూతుల మంత్రి .. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌

విద్యాధరపురం : మంత్రి కొడాలి నాని రాష్ట్ర పరువు తీశారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా మంత్రి క్యాసినో కల్చర్‌ను తీసుకురావడం రాష్ట్రానికి మాయని మచ్చ అన్నారు. మంత్రులే ఇలా బరి తె గిస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Updated Date - 2022-01-18T05:32:10+05:30 IST