రైతులను మోసం చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-01-25T05:26:33+05:30 IST

రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు.

రైతులను మోసం చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే
ధర్నా చేస్తున్న జయనాగేశ్వరరెడ్డి, నాయకులు

ఎమ్మిగనూరు, జనవరి 24: రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. మిరపపంట సాగుచేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరులో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. స్థానిక నీలకంటేశ్వరస్వామి ఆలయం దగ్గర నుంచి పట్టణ ప్రధాన రహదారుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా సోమప్ప సర్కిల్‌ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు సీఎం జగన్‌ రైతులకు అనేక వాగ్దానాలు చేసి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటున్న జగన్‌ రైతులకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లాలో లక్షల రుపాయాలు వెచ్చించి రైతులు మిరప పంటను సాగు చేస్తే.. వైరస్‌ సోకి వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికానీ సీఎం జగన్‌ కానీ పలకరించిన పాపాన పోలేదన్నారు. మిరపపంటను సాగుచేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. లక్ష నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో మంచి మిరప పలుకుతున్న ధరకు తాలు కాయను కొనాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభత్వ హయంలో మాజీ సీఎం చంద్రబాబు సహకారంతో కర్నూలు పశ్చిమ ప్రాంత రైతుల కోసం ఆర్డీఎస్‌ కుడికాలువ మంజూరు చే యించి రూ. రెండువేల కోట్లు విడుదల చేయిస్తే రివర్స్‌ టెండర్‌ పేరుతో నిలిపివేశారని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు సాగలేదని అన్నారు. అనంతరం ఏడీఏ కార్యాలయం చేరుకొని ఏడీఏ జమ్మన్నకు వినతిపత్రం ఇచ్చారు. కాగా ధర్నాలో పాల్గొని గోనెగండ్లకు చెందిన మిర్చి రైతు సోమన్న మాట్లాడుతూ తనకు మూడెకరాల భూమి ఉందని, రెండు ఎకరాల్లో మిరప, ఎకరలో ఉల్లి సాగు చేశానని అన్నారు. ఉల్లి పంటకు మద్దతు ధర లేకపోవటంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదన్నారు. ఇక మిరప సాగుకోసం దాదాపు రూ. 2.80 లక్షలు ఖర్చుచేశానన్నారు. పంటవైరస్‌ సోకి కాయలు తాలుగా మారిపోయిందని అన్నారు. దీంతో పంట అమ్మితే కేవలం రూ. 76వేలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిర్చిరైతును ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామలింగారెడ్డి, ముగతి ఈరన్నగౌడ్‌, గాజులదిన్నె హనుమంతు, రైస్‌మిల్లు నారాయణరెడ్డి, చిన్నరాముడు, కాశీంవలి, ధర్మపురం గోపాల్‌, జబ్బార్‌, కొండన్నగౌడ్‌, మల్లికార్జున, ఈరన్న, రంగముని, రామాంజనేయులు, అబ్రహాం, శంకర్‌గౌడ్‌, సురేష్‌ చౌదరి, డబ్బా ఈరన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T05:26:33+05:30 IST