Abn logo
Sep 25 2021 @ 03:32AM

చంద్రబాబును, లోకేశ్‌ను చంపేస్తామన్నారు

విధుల్లో ఉన్న పోలీసులు చోద్యం చూస్తూండిపోయారు

గుంటూరు అర్బన్‌ అదనపు ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు


గుంటూరు, సెప్టెంబరు 24: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చంపేస్తామన్నారు. ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తన అనుచరులతో కలసి దాడికి యత్నించిన ఘటనపై తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు’’ అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తదితరులతో కలసి ఆయన శుక్రవారం గుంటూరు అర్బన్‌ అదనపు ఎస్పీ గంగాధరానికి ఫిర్యాదు చేశారు. 17న ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో చంద్రబాబు ఇంట్లో పార్టీ నేతల సమావేశానికి తాను హాజరయ్యానని బుద్దా వెంకన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఆ సమయంలో నా పీఏ ఫోను చేసి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తన అనుచరులతో కర్రలు తీసుకుని చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు వస్తున్నారని చెప్పారు. దీంతో నేను, పార్టీ నాయకులు చెన్నుపాటి గాంధీ, గొట్టిముక్కల రఘురామరాజు, దూండి రాకేశ్‌, ఎల్‌.ఉమామహేశ్వరరావు, పులి మర్రిరాజు (చిన్నా), కంభంపాటి శిరీష, మరికొందరు కార్యకర్తలతో వెంటనే గేటు వద్దకు వెళ్లాం. మేం వారిని నియంత్రించేందుకు ప్రయత్నించాం. అయితే వారు... ‘మా సీఎం జగన్‌ చెప్పారు. చంద్రబాబును వదిలేది లేదు. ఈ రోజు చంపేస్తాం’ అని దౌర్జన్యంగా తోసుకుంటూ రావటానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా... ‘డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ సహకారం మాకు ఉంది. ఈ రోజు తాము చంద్రబాబు, లోకేశ్‌ను, అడ్డువచ్చిన మిమ్మల్ని చంపిన తర్వాతే ఇంటికి వెళతాం’ అని ఎమ్మెల్యే జోగి రమేశ్‌తోపాటు అతని అనుచరులు 30 మంది పెద్దగా అరుస్తూ జెండా కర్రలతో బెదిరించారు’’ అని తెలిపారు. వారి నేర స్వభావాన్ని గమనించి చంద్రబాబును రక్షించేందుకు, వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేయగా తనను, మిగిలిన నేతలను, కార్యకర్తలను కర్రలు, రాళ్లతో కొట్టారన్నారు. ఈ దాడిలో తమకు గాయాలయ్యాయన్నారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అక్రమంగా వచ్చిన వారిని నిలువరించకపోగా ప్రేక్షకపాత్ర వహించటమేకాక తమపైనే లాఠీచార్జి చేశారన్నారు. అనంతరం వెంకన్న మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితి లో పోలీసులు ఉన్నారన్నారు. ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఎస్పీ, డీఐజీ, డీజీపీ అందరూ కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుందని పట్టాభి హెచ్చరించారు.