Abn logo
Aug 2 2020 @ 19:09PM

దోచుకునేందుకు విశాఖలో రాజధాని పేరుతో రాజకీయం: టీడీపీ ఎమ్మెల్యే

ప్రకాశం: కుట్ర పూరితంగా విశాఖపట్నంను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరంజనేయ స్వామి డిమాండ్ చేశారు. వైసీపీ నేతల వ్యవహారం దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్యమన్నట్లుగా ఉందని విమర్శించారు. రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు జగన్ రెడ్డి ఫోటోలకు క్షీరాభిషేకం చేయడం ఏంటని, అసలు ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారో కూడా వారికి అర్ధం కాని పరిస్థితి ఉందని విమర్శించారు. 


జిల్లా నుంచి 170 కి.మీ. దగ్గరలో ఉన్న రాజధానిని తీసుకుపోయి 550 కి.మీ. దూరంలో ఉన్న విశాఖకు,  హైకోర్టును 350 కిమీ దూరంలో ఉన్న కర్నూలుకు తరలిస్తునందుకు ప్రజలు భవిష్యత్తులో పడబోతున్న ఇక్కట్లును తలుచుకొని వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


ప్రభుత్వ పెద్దలు కొంత మంది భూములు దోచుకునేందుకు వైజాగ్ లో రాజధాని పేరుతో రాజకీయం చేస్తున్నారని, మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగల్భాలు పలికే ఈ పెద్ద మనుషులకు ప్రకాశం జిల్లా ప్రయోజనాలు పట్టవా అని, హైకోర్టు, రాజధానిని జిల్లా ప్రజలకు అందనంత దూరం మార్చినందుకు పాలాభిషేకం చేశారా.. మీకు ప్రజల సౌలభ్యాలు పట్టవా అని ఎమ్మెల్యే బాలవీరంజనేయ స్వామి ప్రశ్నించారు. 


తెలుగుదేశం హయాంలో జిల్లాకు వచ్చిన కంపెనీలన్నీ వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు వెనక్కి వెళ్లిపోయేలా చేశారని, జిల్లాలోని యువతకు ఉద్యోగాలు రాకుండ చేశారని విమర్శించారు. గడిచిన 14 నెలల నుంచి రాష్ట్రం ఎంత వెనకబడిందో వైసీపీ నాయకులకు తెలియవా అని, అన్ని మరిచిపోయి సంబరాలు చేసుకుంటున్నందుకు వైసీపీ నాయకులు సిగ్గుపడాలని టీడీపీ ఎమ్మెల్యే  స్వామి విమర్శించారు.


Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement