Abn logo
Apr 8 2021 @ 02:15AM

టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

  • టీడీపీకి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు రాజీనామా
  • 2019లోనే టీఆర్‌ఎస్‌లోకి మరో ఎమ్మెల్యే సండ్ర
  • ఇద్దరితో కూడిన టీడీఎల్పీ విలీనానికి స్పీకర్‌ ఓకే
  • విలీనంపై బులెటిన్‌ జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
  • ఉభయ సభల్లో ప్రాతినిధ్యం కోల్పోయిన టీడీపీ
  • తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని అర్థమైంది
  • నా నిర్ణయంతో ప్రజలు సంతోషిస్తారు: మెచ్చా

హైదరాబాద్‌/అశ్వారావుపేట, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ చట్టసభల్లో టీడీపీ ఉనికి కోల్పోయింది. టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే, అశ్వారావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మెచ్చా నాగేశ్వర్‌రావు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షంలో విలీనమైంది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు బుధవారం బులెటిన్‌ జారీ చేశారు. తొలుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇద్దరు మాత్రమే సభ్యులు ఉన్న టీడీఎల్పీని టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేయాలనే తమ అభిమతాన్ని ఆయనకు తెలియజేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 2019 మార్చిలోనే టీడీపీని వీడి టీఆర్‌ఎ్‌సలో చేరినా.. అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగానే చలామణిలో ఉన్నారు. తాజాగా తాను కూడా టీడీపీకి రాజీనామా చేసినట్లు మెచ్చా నాగేశ్వరరావు.. సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఇకపై సాంకేతిక సమస్యలు లేకుండా టీడీఎల్పీని టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసి, సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులుగా కొనసాగుతామని వారు ప్రతిపాదించారు. 

ఈ మేరకు లేఖను అందించగా.. సీఎం స్వాగతించారు. మెచ్చా నాగేశ్వరరావు మెడలో సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి, టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారు. అనంతరం వారిద్దరు రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి నివాసానికి వెళ్లారు. టీఆర్‌ఎ్‌సఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లుగా అధికారిక లేఖను ఎమ్మెల్యేలిద్దరూ ఉమ్మడిగా స్పీకర్‌కు అందజేశారు. టీడీఎల్పీ విలీనానికి అభ్యంతరం లేదని ఆయనకు టీఆర్‌ఎ్‌సఎల్పీ నివేదించింది. ఈ ప్రక్రియకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ నాల్గవ పేరా ప్రకారం స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆమోదం తెలిపారు. అనంతరం టీఆర్‌ఎ్‌సఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా ఉత్తర్వులు వెలువడగా, టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరికీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు మళ్లీ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. 


టీడీపీకి గడ్డు కాలం..

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి గడ్డు కాలం నడుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది 2016లో టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనమయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరే ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా.. ప్రస్తుతం వారు కూడా విలీనమయ్యారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆ పార్టీకి కలిసి రాలేదు. స్వయంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్‌.రమణ పోటీ చేసినా.. ప్రథమ ప్రాధాన్యత ఓట్లు కనీసం 10 వేలు కూడా దక్కించుకోలేకపోయారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ నుంచి అటు శాసనమండలి, ఇటు అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవటం దాదాపుగా ఇదే మొదటిసారి. 


నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎ్‌సలోకి: మెచ్చా

నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎ్‌సలో చేరినట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదన్న విషయం అర్థమైందన్నారు. తన నిర్ణ యం వల్ల నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని, వారు సంతోషిస్తారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దాదాపు రెండున్నరేళ్లు టీడీపీలోనే కొనసాగటం వల్ల నియోజకవర్గ ప్రజలు కోరుతున్న రోడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు ఆశించినంతగా చేయలేకపోయానని తెలిపారు. అందుకే పార్టీ మారినట్లు వివరించారు. నియోజకవర్గం పరిధిలోని రైతులు, గిరిజనులు సహా అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో సీఎం కేసీఆర్‌ నుంచి హామీ లభించిందని అన్నారు. అయితే మెచ్చా నాగేశ్వర్‌రావుకు కేబినెట్‌ హోదా కలిగిన పదవి లభించబోతోందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 


2018 ఎన్నికల తర్వాత ఇది రెండో విలీనం..

గడిచిన రెండున్నరేళ్లలో ఇతర పార్టీల శాసనసభాపక్షాలు టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం కావడం ఇది రెండవది. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88, కాంగ్రెస్‌ 19, ఎంఐఎం 7, టీడీపీ 2 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్రులు ఒక్కో స్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రె్‌సకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు 2019 జూన్‌లో టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం కాగా, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తాజాగా విలీనమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఎమ్మెల్యే, స్వతంత్ర ఎమ్మెల్యే ఇరువురూ మెడలో గులాబీ కండువాలు కప్పుకొన్నప్పటికీ, అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తింపు పొందకుండానే కొనసాగుతున్నారు. టీడీఎల్పీ విలీనంతో అసెంబ్లీలో అధికారికంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 101కి చేరింది. అనధికారిక లెక్కను పరిగణనలోకి తీసుకుంటే, ఆ సంఖ్య 103గా ఉంటుంది. 

Advertisement
Advertisement
Advertisement