గోదారిలో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల సేఫ్..!

ABN , First Publish Date - 2020-08-20T03:05:46+05:30 IST

మర పడవలో ముంపు గ్రామాలకు వెళ్లి తిరిగి వస్తూ గోదారిలో చిక్కుకున్న పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును...

గోదారిలో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల సేఫ్..!

యలమంచిలి: మర పడవలో ముంపు గ్రామాలకు వెళ్లి తిరిగి వస్తూ గోదారిలో చిక్కుకున్న పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును, పడవలో ఉన్న మరో తొమ్మిది మందిని రెస్క్యూ టీం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తూర్పుగోదావరి జిల్లా దిండి గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద మర పడవ గోదావరిలో నిలిచిపోయింది. పడవలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు 15 మంది ఉన్నారు. సహాయం కోసం ఎమ్మెల్యే అధికారులకు సమాచారం ఇచ్చారు.


పడవలో బాడవ గ్రామానికి వెళ్లి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిసింది. నదిలో ఉధృతికి పడవ కొంతదూరం కొట్టుకుపోయిందని సమాచారం. గోదావరిలో పడవ ఒక మూలకు చేరుకోవడంతో పడవను చెట్టుకు కట్టారు. దీంతో.. పడవ అక్కడే నిలిచిపోయింది. రెస్క్యూ టీం వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో యలమంచిలి మండలంలోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మంగళవారం కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, బాడవ గ్రామాలు పూర్తిగా జలదిగ్భంధం అయ్యాయి. ఈ గ్రామాల్లో ప్రజలు పడవలపై రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొంది. 


Updated Date - 2020-08-20T03:05:46+05:30 IST