మైనింగ్ మాఫియా ఆటకట్టిస్తాం: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-07-31T21:53:15+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రకృతి వనరుల దోపిడీలో మునిగితేలుతోందని తెలుగుదేశం కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు అన్నారు.

మైనింగ్ మాఫియా ఆటకట్టిస్తాం: అశోక్‌బాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ప్రకృతి వనరుల దోపిడీలో మునిగితేలుతోందని తెలుగుదేశం కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మట్టి, ఇసుక, బాక్సైట్, లాటరైట్, సిలికాన్ వంటి వాటిపై వైసీపీ నేతల కన్నుపడిందన్నారు. వైసీపీ నేతలు తమ దోపిడీ కోసం పోలవరం కాలువలను కూడా తవ్వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఏ స్థాయిలో విరుచుకు పడుతుందో చెప్పడానికి ఎన్జీటీ తీర్పే నిదర్శనమన్నారు. విశాఖ మన్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ కోరిందన్నారు.


 ప్రభుత్వ నివేదికతో పాటు, ఐదుగురు సభ్యులను నియమించి, వారి నివేదిక కూడా కోరిందన్నారు. ఎన్జీటీ తీర్పు వచ్చాక సాధారణంగా ఏ ప్రభుత్వమైనా మైనింగ్ నిలిపేస్తుందని కానీ జగన్ ప్రభుత్వం తవ్వకాలను మరింత ఉధృతం చేసిందన్నారు. కొండపల్లి మైనింగ్ ప్రాంతానికి టీడీపీ వారిని వెళ్లకుండా ఈ రోజు అడ్డుకున్న ప్రభుత్వం, భవిష్యత్‌లో ఎలా అడ్డుకుంటుందో చూస్తామన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే రాష్ట్రంలోని మైనింగ్ మాఫియా ఆటకట్టిస్తామని హెచ్చరించారు. మైనింగ్ మాఫియా ఆగడాలు, దుశ్చర్యలపై కేంద్రానికి, ఎన్జీటీకి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని అశోక్‌బాబు తెలిపారు. 

Updated Date - 2021-07-31T21:53:15+05:30 IST