హోదాపై పెదవి విప్పని వైసీపీ ఎంపీలు: టీడీపీ

ABN , First Publish Date - 2021-07-18T21:22:22+05:30 IST

టీడీపీ తరపున రాష్ట్ర, కేంద్ర అంశాలను లేవనెత్తామన్నారు. అమరావతి అంశాన్ని అఖిలపక్షంలో లేవనెత్తామని, ప్రధానమంత్రి దగ్గర ప్రత్యేక హోదా అంశం పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు.

హోదాపై పెదవి విప్పని వైసీపీ ఎంపీలు: టీడీపీ

న్యూఢిల్లీ: కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు... అనంతరం మీడియాతో మాట్లాడారు. 


టీడీపీ తరపున రాష్ట్ర, కేంద్ర అంశాలను లేవనెత్తామన్నారు. అమరావతి అంశాన్ని అఖిలపక్షంలో లేవనెత్తామని, ప్రధానమంత్రి దగ్గర ప్రత్యేక హోదా అంశం పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎంపీలు హోదాపై మాట్లాడలేదు. ఏపీకి కాపిటల్ అమరావతి అని కేంద్రం మ్యాప్‌లో చూపిందని చెప్పుకొచ్చారు. పోలవరం నిధులు, ఆర్ ఎండ్ ఆర్ ప్యాకేజీ అంశాన్ని గతంలో సిద్ధం చేసినా నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, కేసీఆర్‌కి సరెండర్ అయ్యి రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ గాలికి వదిలేసిందని విమర్శించారు. కేంద్రానికి, అటు తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయినట్లుగా కనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని తాకట్టు ప్రదేశ్‌గా చేశారని విమర్శించారు. 


కనిపించిన ప్రతి వస్తువునీ తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. 124(ఏ) సెడిషన్ లా రద్దు చేయాలని కూడా కోరామని ఎంపీ కనకమేడల అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు - వాటిపై రాష్ట్ర ప్రభుత్వాల పన్నులపై కూడా చర్చించామన్నారు. రైతుల ఆందోళనను పరిష్కరించాలని కోరామన్నారు. ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్‌సీపీ మాటలు తప్ప చేతలు లేవన్నారు. కేంద్రంతో పోరాడే పరిస్థితి అసలే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు, పరిహారం పునరావాసం ప్యాకేజీకి అవసరమైన నిధులు తదితర అంశాల గురించి కూడా చర్చించామన్నారు. ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖపట్నం అంశంలో రాజీనామా చేయడానికి వైసీపీ ఎంపీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-07-18T21:22:22+05:30 IST