Abn logo
Oct 22 2021 @ 02:51AM

జగన్‌కు ముడుపులు ముడుతుంటే చర్యలేం ఉంటాయి?

ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తాం

ఈసారి దాడులు జరిగితే తలలు పగులుతాయి: లోకేశ్‌ హెచ్చరిక


అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘కేజీకి ఇంత అని జగన్‌రెడ్డికి ముడుపులు అందుతూ ఉంటే గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై చర్యలు ఏం ఉంటాయి? దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్ర నుంచే రవాణా అయిందని ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులు ప్రకటిస్తున్నారు. జాతికి మత్తెక్కించి సర్వనాశనం చేయడంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఘనతకు పాలాభిషేకాలు చేసుకోండి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విరుచుకుపడ్డారు. గురువారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యసనంతో ఒక తరం నాశనమయ్యే ప్రమాదం పొంచి ఉందని, అందుకే తమ పార్టీ దీనిపై పోరాటం చేస్తోందని చెప్పారు. ‘పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలు లేకుండా చేస్తామని, ఎవరైనా గంజాయి సాగుచేస్తే ఆ భూమికి పట్టాలు కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ప్రతి పాఠశాల వద్దా తనిఖీలు చేసి విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్‌ అమ్ముతుంటే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ చర్యలు ఇక్కడెందుకు తీసుకోరు? సరిహద్దుల వద్ద తనిఖీల్లో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు మాదక ద్రవ్యాలతో పట్టుబడితే ఏం చర్యలు తీసుకున్నారు? డ్రగ్స్‌ వ్యాపారంలో వైసీపీ నేతలు ఉన్నారని దీనిని బట్టే అనిపిస్తోంది. దీనిపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తాం. దాడుల గురించి కూడా ప్రస్తావిస్తాం. డ్రగ్స్‌ గురించి మాట్లాడగానే ఉలిక్కిపడి మాపై దాడులకు దిగారు’ అని ధ్వజమెత్తారు.


‘తన తల్లిని ఏదో అన్నారని జగన్‌ ఆవేదన వలకబోస్తున్నారు. ఆయన మంత్రులు రాష్ట్రంలోని తల్లులందరినీ అన్నప్పుడు అవి ఆయనకు వినిపించలేదా? అమ్మను తిట్టింది ఈ రాష్ట్రంలో మొదట ఎవరు? ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు తల్లిని దూషించలేదా? అవన్నీ గుర్తు లేనట్లు జగన్‌రెడ్డి ప్రదర్శిస్తున్న నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వలేకపోయునా కనీసం భాస్కర్‌ అవార్డు అయినా ఇవ్వొచ్చు’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫోన్‌నంబరు తనకు తెలియదని, అందుకే ఫోన్‌ తీయలేకపోయానన్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వ్యాఖ్యలను లోకేశ్‌ ఆక్షేపించారు. ‘ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నంబరు నిజంగా ఆయనకు తెలియదా? తన పోస్టింగ్‌ కోసం ఆయన చంద్రబాబుకు నాలుగైదుసార్లు ఫోన్‌ చేయలేదా? ఇంటిముందు పడిగాపులు పడలేదా? అవన్నీ మర్చిపోయారా’ అని ప్రశ్నించారు. ‘నేను బోర్న్‌ రెడీ (పుట్టుకతోనే సిద్ధంగా ఉన్నాను). నేనేమీ దేశాన్ని దొబ్బి జైలుకు వెళ్లడంలేదు. ప్రజల కోసం ప్రజల సమస్యలపై పోరాడితే కేసులు పెడుతున్నారు. నాపై ఇప్పటికే 9కేసులు పెట్టారని అంటున్నారు. తెలియనివి ఇంకా ఎన్ని పెట్టారో తెలియదు. జైలుకు వెళ్లాల్సి వస్తే నేను సిద్ధం. పోలీసు ఉద్యోగి అని చెబుతున్న వ్యక్తి మా పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ వారితో కలిసి వచ్చారు. మా పార్టీ కార్యకర్తలు పట్టుకుని ఒక గదిలో పెడితే ఆయనకు టీ కాఫీలు ఇచ్చి మరీ పోలీసులకు అప్పగించాం. అందుకు మాపై హత్యాయత్నం కేసు పెట్టారు. మా పార్టీ కార్యాలయం లో పనిచేసే బద్రి తలను వైసీపీ గూండాలు బద్దలుగొడితే వారిపై హత్యాయత్నం కేసు పెట్టలేదు’ అని విమర్శించారు. ‘ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు. ఇది ఎక్కువరోజులు సాగదు. ఇంకోసారి దాడులు జరిగితే తలలు పగులుతాయి’ అని హెచ్చరించారు. పీకే పనిచేసినా ఈసారి వైసీపీ ఓటమిని ఎవరూ ఆపలేరు అని లోకేశ్‌ స్పష్టం చేశారు.


దృష్టి మళ్లించడానికే దాడులు: అచ్చెన్నాయుడు

ప్రజల్లో తమ పాలన పట్ల పెరిగిపోతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికే వైసీపీ ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో తమ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ చేస్తున్న అరాచకాల్లో ఒక శాతం అయినా మేం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఆ పార్టీ నాయకులు బతికేవారా? పోలీసులు, రౌడీల అండతో టీడీపీని భూస్థాపితం చేయాలని జగన్‌రెడ్డి కలలు కంటున్నారు. అది ఆయన తండ్రి, తాత వల్లే కాలేదు. తమ ప్రాణాలు బలిదానం చేసిన పోలీసు అమరవీరుల ఆత్మలు క్షోభించేలా డీజీపీ వ్యవహరిస్తున్నారు. పట్టాభి ఇంటిపై దాడి జరిగి 48 గంటలు గడిచినా దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. కానీ పట్టాభిని మాత్రం అరెస్టు చేశారు. అధికార పార్టీకి ఊడిగం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టం. పదవీ విరమణ చేసి మరో చోటికి పోయినా తమ పాపాలకు ఫలితం అనుభవించేలా చేస్తాం’’ అని హెచ్చరించారు. రాష్ట్రం డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌ అయ్యేవరకూ తమ పోరాటం ఆగదని అచ్చెన్న స్పష్టం చేశారు. మా ఫ్యాన్స్‌కు బీపీ వస్తే.. ఏపీలో నువ్వుండవ్‌! లోకేశ్‌ 

‘జగన్‌రెడ్డీ.. ఫ్యాన్స్‌ మీకే కాదు.. మాకూ ఉన్నారు. లక్షల మంది ఫ్యాన్స్‌. వాళ్లకు బీపీ వస్తే, నువ్వు ఏపీలో ఉండవ్‌’ అని లోకేశ్‌ హెచ్చరించారు. తన సైకో ఫ్యాన్సే టీడీపీ కార్యాలయంపై బీపీతో దాడిచేశారని ఒప్పుకున్న సైకోరెడ్డిని కూడా టీడీపీ కార్యాలయం దాడి కేసులో నిందితుడిగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రాలో వైసీపీ వాళ్లు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసి వదిలేశారని, రాయలసీమలో అయితే టీడీపీ నేతలను ఖూనీచేసే వాళ్లమంటోన్న మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలన్నారు.