కొండపల్లి అక్రమ మైనింగ్‌కు వైఎస్‌ హయాంలోనే పునాది

ABN , First Publish Date - 2021-08-02T08:27:29+05:30 IST

‘‘కొండపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పునాది వేస్తే... కొడుకు జగన్మోహన్‌రెడ్డి పెంచి పెద్దది చేశారు. కొండపల్లి కొండ మీద ప్రస్తుతం..

కొండపల్లి అక్రమ మైనింగ్‌కు వైఎస్‌ హయాంలోనే పునాది

సన్నిహితుని కోసం దొంగ సర్వే నంబరు సృష్టి

జగన్‌, వసంత ఆదేశాలతోనే అటవీ భూములు రెవెన్యూలోకి: పట్టాభి


అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘‘కొండపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పునాది వేస్తే... కొడుకు జగన్మోహన్‌రెడ్డి పెంచి పెద్దది చేశారు. కొండపల్లి కొండ మీద ప్రస్తుతం సర్వే నంబరు 143లో 216 ఎకరాల్లో, సర్వే నంబరు 26/2లలో అదనంగా ఉన్న 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా జరుగుతోంది’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ పేర్కొన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. రికార్డుల్లో లేని సర్వే నంబరు 143ను వైఎస్‌  హయాంలో సృష్టించారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కేవలం పెన్నుతో రాసి ఈ పని చేశారని తెలిపారు. దానికింద 216 ఎకరాలను చేర్చారన్నారు. వైఎ్‌సఆర్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండే జి.సుదర్శన్‌రావు అనే వ్యక్తి అక్కడ 2006లో మైనింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ‘‘సర్వే నంబరు 143 బోగస్‌ అని 2016 డిసెంబరు 12న హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దీంతో అక్కడ జరుగుతున్న మైనింగ్‌ మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆపేసింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతంలో మైనింగ్‌కు నిబంధనలు పాటించలేదంటూ సర్వే నంబర్‌ 26/2లో జరుగుతున్న మైనింగ్‌లన్నింటినీ రద్దుచేస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి జేసీ విజయ్‌ కృష్ణన్‌ ఉత్తర్వులిచ్చారు. ఇవేవీ ఎవరికీ తెలియనట్లు మైలవరం వీరప్పన్‌ వసంత కృష్ణప్రసాద్‌ పచ్చి అబద్ధాలు చెప్పారు’’ అని విమర్శించారు.


అందరికీ చదువు రాదనుకుంటే ఎలా?

‘‘జేసీ కొండపల్లి మైనింగ్‌ను రద్దు చేశాక కొందరు క్రషర్‌ యజమానులు నాటి మంత్రి కేఈ కృష్ణమూర్తిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. రికార్డులు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని కేఈ తెలిపారు. అంతేకానీ ఆయనెక్కడా అటవీ భూములను రెవెన్యూ భూములుగా పరిగణిస్తూ ఉత్తర్వు ఇవ్వలేదు. మైలవరం వీరప్పన్‌కు చదువురాకుంటే సరే... అందరికీ రాదనుకుంటే ఎలా?’’ అని ప్రశ్నిస్తూ పట్టాభి ఆ పత్రాలను మీడియాకు చూపించారు. కొండపల్లి అటవీ ప్రాంతంలోని అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చింది జగన్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.


జగన్‌, కృష్ణప్రసాద్‌ల ఆదేశాలతోనే అధికారులు ఈ అక్రమానికి పాల్పడ్డారని అన్నారు. ‘‘కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ చేస్తున్న వారికి అండగా నిలిచినందుకు పంచాయతీ ఎన్నికలకు ముందు రూ.5 కోట్లు వసూలు చేసింది వాస్తవం కాదా? నాటి కలెక్టర్‌ ఇంతియాజ్‌ మైనింగ్‌ వద్దన్నా... అప్పటి ముఖ్య కార్యదర్శి ఉషారాణి పేరుతో 18.12.2020న ఉత్తర్వులు తెచ్చింది నిజం కాదా? ఈ వ్యవహారమంతా నడిపింది మైలవరం వీరప్పన్‌  కాదా?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2021-08-02T08:27:29+05:30 IST