Abn logo
Oct 22 2021 @ 00:47AM

రాష్ట్రంలో.. రౌడీ పాలన!

దీక్షలో పాల్గొన్న చంద్రబాబునాయుడు

ప్రశ్నించిన వారిపైనే దాడులా?

అయినా భయపడేది లేదు..

టీడీపీ కార్యాలయంపై దాడి ప్రభుత్వ ఉగ్రవాద ప్రేరేపిత చర్చే..

జిల్లా టీడీపీ నేతల ధ్వజం

కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్లిన నేతలు, కార్యకర్తలు

అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతు 


గుంటూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మంగళగిరి వద్ద టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36గంటల నిరసన దీక్షకు జిల్లానుంచి పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఉదయం 9గంటల సమయంలో పార్టీ కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్‌ మధ్య నుంచే చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని... ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని పలువురు నేతలు వేదికపై మాట్లాడారు. నేతలు ఏమన్నారంటే...

 

రాష్ట్రాన్ని నాశనం చేశారు...

ఒక్కఛాన్స్‌ అంటూ జగన్‌ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారు. ఇప్పటికే ఆయనకు ఓటేసిన వారు పశ్చాత్తాప పడుతున్నారు. ప్రశ్నించే వారిపై  పోలీసు కేసులు పెడుతున్నారు. ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండకూడదా..? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంపై ఎప్పుడైనా దాడులు జరిగాయా..? ప్రజల మెప్పు పొందడం చేతగాక జగన్‌రెడ్డి దాడులు చేయిస్తున్నారు.  టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే. అధికారం శాశ్వతం కాదని జగన్‌రెడ్డి గుర్తుంచుకోవాలి.  

- ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి


ప్రజాస్వామ్యం దగా అవుతోంది..

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిట్టనిలువుగా దగా అవుతోంది. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం రోజూ అవమానాల పాలవుతోంది. జీవించే హక్కు, వాక్‌ స్వాతంత్ర్యాన్ని రాష్ట్రంలో కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జగన్‌రెడ్డి రాక్షస పాలనను ప్రజలకు  తెలియజేయాల్సిన అవసరం ఉంది. బూతుల భాషను మొదలుపెట్టింది వైసీపీ నేతలు, మంత్రులు కాదా..? ఏపీ గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎక్కడ గంజాయి పట్టుకున్నా మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల పోలీసులే చెప్పారు. గుజరాత్‌ ముంద్రా పోర్డు నుంచి హెరాయిన్‌ ఏపీకి వచ్చింది. ఈ ఘటనలకు పోలీసులు, ప్రభుత్వం సిగ్గుపడాలి. తన అభిమానులే దాడులు చేశారంటూ జగన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యులు బతికే పరిస్థితి ఉండదు.

 - నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి


అరాచకం రాజ్యమేలుతోంది..

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. సీఎం జగన్‌ మాటలు వింటుంటే ఆయనలో మంచి నటుడు ఉన్నాడని అర్థమవుతోంది. వైసీపీ ప్రభుత్వం పన్నుల మోతతో ప్రజల రక్తాన్ని తాగుతోంది. ఏపీలో  గంజాయి ఏరులై పోరుతోంది. పక్క రాష్ట్రంల్లో గంజాయి పట్టుబడినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. మా యువనేత నారా లోకేశ్‌ ఏం చేశారని ఆయనపై కేసు పెట్టారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను హత్య చేశారు. మీ అరాచకాలను ప్రశ్నించిన జడ్జి రామకృష్ణను అరెస్ట్‌ చేశారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. ప్రశ్నించిన  ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ప్రభుత్వ అరాచక విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. 

- ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ మంత్రి

 

రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించారు..

సీఎం జగన్‌రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారు. వైద్యులు వద్దన్నా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు 36గంటల దీక్ష చేస్తున్నారు. రక్తం కారుతుంటే చూస్తూ ఆనందించే శాడిస్టు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఓర్పును చేతగాని తనంగా తీసుకోవద్దు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన సీఎం గొడవలను ప్రోత్సహించడం ఏమిటి..? చంద్రబాబు పాలనలో రాష్ట్ర పోలీసు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉండేది. చంద్రబాబును ఉరి తీయాలని అన్నప్పుడు చంద్రబాబు తమని జగన్‌లా దాడులకు ప్రోత్సహించలేదు. దాడుల సంస్కృతికి తెరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. టీడీపీ తలుచుకుంటే వైసీపీ గుండాలను రాష్ట్రం వదిలి పారిపోయే దాకా తరిమికొడతాం.

- జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే


రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పాలిస్తోంది

 రాష్ట్రంలో ప్రతిపక్షాలను రౌడీయిజంతో అణచివేతకు ముఖ్యమంత్రి జగన్‌ కంకణం కట్టుకున్నారు.  టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం, నాయకుల ఇళ్ళపై వైసీపీ గూండాలు చేసిన దాడులు నీచమైనవి. మీ ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తిచూపితే గూండాలతో దాడి చేయిస్తారా...? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌లే వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దాడులు చేసినవారిని వదిలేసి టీడీపీ నాయకులపై కేసులు పెట్టటం సిగ్గుచేటు. అధికారం ఎప్పుడూ ఒకవైపు ఉండదని పోలీసులు గమనించాలి. వైసీపీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా మాట్లాడినపుడు మాత్రం పోలీసులకు కనపడదా.. వినపడదా..? వైసీపీ బెదిరింపులకు టీడీపీ నాయకులెవరూ భయపడేది లేదు. మీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 

- ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌


  నమ్మిన వాళ్లనే నాశనం చేశారు..

జగన్‌రెడ్డి తనకు మేలు చేసిన వాళ్లను నాశనం చేస్తున్నారు. తండ్రిని హెలికాప్టర్‌ ఎక్కించి పంపించారు.. తనకోసం పాదయాత్ర చేసిన చెల్లిని పక్క రాష్ట్రాలకు పంపారు.. ప్రార్థన చేసిన తల్లిని పత్తా లేకుండా చేశారు. ఓట్లువేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రం నాశనం చేశారు. ఒకప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా పిలువబడే రాష్ట్రం నేడు గంజాయాంధ్రప్రదేశ్‌ అయ్యింది. మంత్రి కొడాలి నాని, స్పీకర్‌, మంత్రులు మాట్లాడే బూతులు చక్కటి మంత్రాలుగా,  పట్టాభి భాష బూతులుగా సీఎంకు వినపడుతున్నాయా..? దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి మీరు చేసే గంజాయి, సారాయి, దోపిడీల గురించి మాట్లాడితే జనాగ్రహం అంటే ఏమిటో తెలుస్తుంది.

- పిల్లి మాణిక్యరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి