ఇక సమరమే

ABN , First Publish Date - 2021-08-02T05:40:23+05:30 IST

జిల్లాలో ప్రజా సమస్యలు, పాలనలో నెలకొన్న అవినీతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇప్పటికే కృష్ణాజలాల విషయంలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు జరగబోతున్న అన్యాయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించటం, అది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలు, అవినీతి వ్యవహారాలపై ఆపార్టీ దృష్టి సారించింది.

ఇక సమరమే

జిల్లాలోని సమస్యలపై టీడీపీ నేతల దృష్టి 

ప్రత్యక్ష కార్యాచరణకు సన్నద్ధం 

నేడు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల ప్రత్యేక భేటీ

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

జిల్లాలో ప్రజా సమస్యలు, పాలనలో నెలకొన్న అవినీతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇప్పటికే కృష్ణాజలాల విషయంలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు జరగబోతున్న అన్యాయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించటం, అది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన  పలు ముఖ్యమైన అంశాలు, అవినీతి వ్యవహారాలపై ఆపార్టీ దృష్టి సారించింది. తదనుగుణంగా అవసరమైన కార్యాచరణ  రూపొందించేందుకు టీడీపీ ముఖ్యనేతలు సోమవారం ఒంగోలులో సమావేశం కాబోతున్నారు. జిల్లాలోని ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు హాజరు కానున్నారు. 

 ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై రాష్ట్రస్థాయిలోనే టీడీపీ నేతలు ఇటీవల ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించారు. అందుకు అనుగుణంగా జిల్లాలో ఆపార్టీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అంశాలపైనే ప్రత్యేక కార్యాచరణ   రూపొందించుకొని ముందుకు వెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా టీడీపీ నిర్మాణ  కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికను  కాకుండా గతంలో మాదిరి జిల్లా యూనిట్‌గా సమస్యలపై భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధం కావాలని ఆపార్టీ నాయకులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు జరగబోయే అన్యాయంపై ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డి.ఎస్‌.బి.వి. స్వామి ముఖ్యమంత్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ అంశంపై ప్రాంతీయ భేదాలు సృష్టించి వివాదాస్పదం చేసేందుకు అధికార పార్టీ విఫలయత్నం చేసింది. అయితే జిల్లా ప్రజానీకంలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల వాదనకు అనుకూలమైన స్పందన లభించింది. దీనిపై వైసీపీ నాయకులు ఇచ్చిన వివరణ  జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంత ప్రజానీకానికి ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. ఇదే సమయంలో నదీజలాల వివాదంపై కేంద్రం ప్రకటించిన గెజిట్‌లో వెలిగొండకు స్థానం లభించకపోవటం కూడా జిల్లా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. వీటికితోడు ఉపాధి హామీ కింద గతంలో చేసిన పనుల బిల్లులను  నిలిపివేయడం, జగనన్న కాలనీల వ్యవహారంలో లొసుగులు, అర్బన్‌ హౌసింగ్‌లో నెలకొన్న సమస్యలు, ఆయా కార్పొరేషన్ల నిధులను దారిమళ్లించడం తదితర అంశాలపై టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఇవిగాక ఆయా నియోజకవర్గాల వారీ స్థానిక సమస్యలు, ప్రత్యేకించి రాజకీయ వైషమ్యాలతో చేయూత లాంటి పథకాలను అర్హత ఉన్న లబ్దిదారులకు దూరం చేయటం లాంటి అంశాలపై కూడా టీడీపీ నేతలు స్పందించిన తీరుకు ప్రజల నుంచి సానుకూలత లభించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ వ్యవహారాలను పక్కనబెట్టి పాత జిల్లాను యూనిట్‌గా తీసుకుని టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. ఒంగోలు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, ఏలూరి సాంబశివరావుల అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి చీరాల మినహా మిగిలిన నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు హాజరుకానున్నారు. 


Updated Date - 2021-08-02T05:40:23+05:30 IST