చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

ABN , First Publish Date - 2020-12-04T15:06:33+05:30 IST

పెండింగ్ ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

అమరావతి: పెండింగ్ ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పెండింగ్‌లో ఉన్న రూ.2500కోట్లు తక్షణమే చెల్లించాలంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ...జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాభివృద్ధికి గ్రహణం పట్టిందని విమర్శించారు. సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్నారన్నారు. నరేగా నిధుల్ని సద్వినియోగం చేసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ చేపట్టిందని గుర్తుచేశారు. ప్రభుత్వం మారిన వెంటనే నరేగా బిల్లులు నిలుపుదల చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగట్లేదని... ఒక్క రోడ్డయినా వేశారా అని చినరాజప్ప ప్రశ్నించారు. 




ఎమ్మెల్సీ  వైవీబీ రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ... రూ.2500కోట్లతో గ్రామాల్లో 2018-19లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఎన్నికలు రావటంతో ఆ బిల్లులు నిలిపేశారని విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా కక్ష సాధింపుతో జగన్ ఆ బిల్లులు చెల్లించట్లేదన్నారు. రూ.1860కోట్లు ఏడాది క్రితమే కేంద్రం మంజూరు చేసినా జగన్ వాటిని మళ్లించారని ఆరోపించారు. అప్పులు చేసి పనులు చేసిన మాజీ స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు.


గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ...వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రూ.1800కోట్లు నిధులు కేంద్రం నుంచి వచ్చినా స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇసుక లేక భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. 70వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయిలు పడిందని తెలిపారు. రాష్ట్రం లో ఒక్కరు కూడా టెండర్లు వేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా కుదేలైందని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో గుడ్డి, చెవిటి, మూగ ప్రభుత్వంగా మారిందని దుయ్యబట్టారు. అసెంబ్లీలో తాము ప్రశ్నిస్తే .. అధికార బలంతో తమను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. మండలిలో తమ అధికార దుర్వినియోగాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కరోనా విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించిందన్నారు. చేతలు కాలాక అకులు పట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. అప్పటికే ఏడు వేల మంది కరోనాతో మృతి చెందారని...క్వారంటైన్ నుంచి ఇంటికి‌వెళ్లే వారికి రెండు వేలు అని ప్రకటించి ఇవ్వలేదన్నారు. నేటికీ సీఎం, మంత్రులు కనీసం మాస్క్‌లు పెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాలను నాశనం‌ చేసిన జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి అనర్హులని గోరంట్ల అన్నారు. 

Updated Date - 2020-12-04T15:06:33+05:30 IST