అరాచకంపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-21T05:25:54+05:30 IST

జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌కు సన్నద్ధమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచి.. బంద్‌ను భగ్నం చేశారు. ముందస్తు అరెస్టులతో వారిని కట్టడి చేశారు. మరోవైపు సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నాయకులు నిరసనలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పట్టాభిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైసీపీ శ్రేణులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.

అరాచకంపై ఆగ్రహం
శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ప్రభుత్వ తీరుపై కదంతొక్కిన టీడీపీ శ్రేణులు

అరెస్టులతో బంద్‌కు ఆటంకాలు 

పోలీసుల వైఖరిపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు మండిపాటు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌కు సన్నద్ధమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచి.. బంద్‌ను భగ్నం చేశారు. ముందస్తు అరెస్టులతో వారిని కట్టడి చేశారు. మరోవైపు సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నాయకులు నిరసనలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పట్టాభిల దిష్టిబొమ్మలను దహనం చేశారు.   వైసీపీ శ్రేణులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. 

--------------

గృహ నిర్బంఽధాలు... నిరసనలు... ధర్నాలు... అరెస్టులు... వాగ్వాదాల నడుమ టీడీపీ చేపట్టిన బంద్‌ సాగింది. బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్ఠానం పిలుపుమేరకు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ మూకల దాడులకు నిరసనగా పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం బంద్‌కు సన్నద్ధమయ్యారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఉదయం 6 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు మోహరించారు. ఆందోళనకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను అడ్డుకున్నారు. మరోవైపు గృహ నిర్బంధాలతో కట్టడి చేశారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. వైసీపీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, టీడీపీ నాయకులు దాసునాయుడు, ఎం.వెంకటేష్‌, పీఎంజే బాబు, చౌదరి బాబ్జీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా   ఎంపీ రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా బంద్‌ చేస్తుంటే... అరెస్టులు చేయడం దారుణమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ ఏ కార్యక్రమం చేసినా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, ఇది సరికాదన్నారు. పోలీసులు పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా ముందస్తు అరెస్టులతో బంద్‌ పాక్షికంగా సాగింది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సు సర్వీసులు కొద్దిసేపు నిలిచిపోయాయి. తర్వాత యథావిధిగా నడిచాయి. 


ప్రజాస్వామ్యానికి తూట్లు : - ఎమ్మెల్యే అశోక్‌  

కవిటి: రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ బెందాళం అశోక్‌ ఆరోపించారు. బుధవారం రామయ్యపుట్టుగ నుంచి నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యే అశోక్‌ బయలుదేరగా.. ఇచ్ఛాపురం సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐ అప్పారావు  సిబ్బందితో  అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సీఐ వినోద్‌బాబు బలవంతంగా ఎమ్మెల్యేను పోలీసు జీపులోకి నెట్టి స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు జీపు ముందు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టి ఎమ్మెల్యేను కవిటి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేషన్‌ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని గంటల  అనంతరం ఎమ్మెల్యేను విడుదల చేసి గృహ నిర్బంఽధించారు. అనంతరం రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే అశోక్‌ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ రౌడీలు మూకుమ్మడిగా దాడి చేయడం చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల గురించి పక్క రాష్ట్రాల పోలీసులు మాట్లాడుకోవడం సిగ్గు చేటన్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అధికార పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని ఆరోపించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అధికార పార్టీ తొత్తుగా పని చేస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించకుండా టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేసి  అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు బి.రమేష్‌, పి.కృష్ణారావు, ఎస్‌.చంద్రమోహన్‌, మాజీ ఎంపీపీలు డి.ఢిల్లీరావు, సీహెచ్‌.శ్రీను, ఏఎంసీ మాజీ ఉపాఽధ్యక్షులు ఎస్‌.వెంకటరమణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T05:25:54+05:30 IST