టీడీపీ రెఢీ

ABN , First Publish Date - 2021-10-23T07:13:48+05:30 IST

జిల్లాలో రాజకీయ వాతావరణం మారిపోతోంది. ఇటీవల వరకు స్తబ్ధుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్‌లో కదలిక వచ్చింది.

టీడీపీ రెఢీ
చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు స్వామి, సాంబశివరావు, రవికుమార్‌

అంతర్మథనంలో వైసీపీ కేడర్‌ 

చంద్రబాబు దీక్షకు భారీగా  వెళ్లిన తెలుగు తమ్ముళ్లు 

అధినేతను వెన్నంటి ఉన్న  జిల్లా నాయకులు 

వైసీపీ తొలి రోజు దీక్షలు అంతంతమాత్రం 

అధిష్ఠానం హెచ్చరికతో మలిరోజు దీక్షలకు ప్రాధాన్యం 

జిల్లావ్యాప్తంగా  వేడెక్కిన రాజకీయం  

జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల కేడర్‌ కూడా రోడ్డెక్కి  సవాళ్లు విసురుకునే పరిస్థితి నెలకొంది. వెలిగొండ, ఆ తర్వాత సీఎం రాక సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల లేఖలతోనే జిల్లాలో విమర్శలు, ప్రతివిమర్శలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ కేడర్‌లో గ్రామస్థాయి నుంచి కదలిక ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకల దాడి ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఎవరి పిలుపుకోసం చూడకుండా వారు రోడ్డుపైకి వచ్చారు. పోలీసుల జులుంను తట్టుకుని నిలబడ్డారు. అంతేగాక రెండురోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లటం విశేషం. మరోవైపు అధికార వైసీపీ కేడర్‌లో కదలిక అంతంతమాత్రంగానే ఉంది. నిరసన కార్యక్రమాలకైతే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తొలిరోజు దీక్షలు ఫ్లాప్‌ అయ్యాయి. అధినాయకుల హెచ్చరికలతో శుక్రవారం దీక్షల కార్యక్రమాన్ని పదిమందితో చేసుకుని సంబరపడిపోయారు. మొత్తంగా ఇటు తమ్ముళ్లలో తెగింపు కనిపిస్తుండగా.. అటు అధికార పార్టీలో కొంతమేర నైరాశ్యం నెలకొంది.


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో రాజకీయ వాతావరణం మారిపోతోంది. ఇటీవల వరకు స్తబ్ధుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్‌లో కదలిక వచ్చింది. అదే సమయంలో అధికారపార్టీ కేడర్‌లో నిర్లిప్తత కనిపిస్తోంది. ఇందుకు అనేక తాజా పరిణామా లు కారణమయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని వి ధంగా జిల్లాకు సంబంధించిన సమస్యలపై సీఎంకు లేఖలు రాయటం, జిల్లాలో పార్టీశ్రేణుల మొత్తాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లటంలాంటి చర్యలకు జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. వారి చర్య తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సా హాన్ని నింపటంతోపాటు జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఐక్యతను పెంచింది. వెలిగొండపై ఆ పార్టీ ఎమ్మెల్యేల సమరమే రాష్ట్రప్రభుత్వాన్ని కదిలించింది. ఇదే సమయంలో వైసీపీ మూకలు మంగళగిరి వద్ద ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, విజయవా డలో ఆ పార్టీ నాయకుడు పట్టాభి ఇల్లు ధ్వంసం, రాష్ట్రంలోని మరికొన్నిచోట్ల కార్యాలయాలపై దాడులు చేయటం మొత్తం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఈ ఘటనపై స్థానిక ముఖ్యనేతల ప్రమేయం లేకుండానే టీడీపీ కేడర్‌ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసుల హెచ్చరికలు, అరెస్టులు, నిర్భంధాలను పట్టించుకోకుండా రోడ్డెక్కి బంద్‌లు చేశారు. ఆ తర్వాత గురు, శుక్రవారాల్లో చంద్రబాబునాయుడు దీక్ష చేస్తుంటే జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి మద్దతు పలికారు. ముందురోజు రాత్రికే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, స్వామి తదితరులు వెళ్లి బాబు నివాసంలో పడుకుని ఆయనతోపాటు దీక్షా శిబిరానికి చేరు కున్నారు. గురువారం రాత్రి నుంచి అద్దంకి ఎమ్మెల్యే రవికు మార్‌ అక్కడ మకాం వేశారు. వీరితో పాటు ఆ పార్టీ ఇన్‌ చార్జ్‌లు అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఎరిక్షన్‌ బాబు, దామచర్ల జనార్దన్‌, పమిడి రమేష్‌, బీఎన్‌ విజయకుమార్‌, నాయకులు నూకసాని బాలాజీ, దివి శివరాం, దామచర్ల సత్యలు శిబిరం వద్దకు చేరి అక్కడ ముఖ్యపాత్ర పోషిం చారు. డెంగ్యూ జ్వరంతో ఉన్న ఉగ్రనరసింహారెడ్డి ఒక్కరే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 


స్వచ్ఛందంగా తరలిన శ్రేణులు

తొలిరోజైన బుధవారం దీక్షకు జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో తెలుగు తమ్ము ళ్లు తరలివెళ్లారు. శుక్రవారం అద్దంకి నియోజకవర్గం నుం చి అధికంగా వెళ్లారు. ఆ తర్వాత ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల నుంచి కూడా భారీగా నే తరలివెళ్లారు. జిల్లాలోని ప్రతి ఊరి నుంచి టీడీపీ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ మొత్తం కార్యక్రమంలో నాయకులు ముందుం డి వాహనాలు ఏర్పాటు చేయటమో, పది రూపాయలు డబ్బులిచ్చి రమ్మని పిలవటమో జరిగిన దాఖలాలు లేవు.  నిన్న మొన్నటివరకు అధికారపార్టీతో ఎందుకన్నట్లు నోరు మెదపకుండా సర్దుకు పోతున్న నాయకులంతా నోరు తెరిచి వైసీపీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు. ఒకరికొరు సవాళ్లు విసురుకుంటున్నారు. 


వైసీపీ కేడర్‌లో నిర్వేదం 

 వైసీపీలోని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో  అంతర్మథనం ప్రారంభమైంది. విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ భౌతిక దాడులు కరెక్టు కాదు అన్న వ్యాఖ్యానాలు ఆ పార్టీలోని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. ఈ రోజు పవర్‌ ఉంది కదా అని మనం వాళ్ల ఆఫీసులు పగులగొడితే రేపు వాళ్లు అధికారంలో ఉండి మా ఇళ్లలోకి వచ్చి కొడితే దిక్కెవరు.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు, ఆ తర్వాత దీక్షలలో అందరూ  పాల్గొన లేకపోవటాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీలోని కేడర్‌ని అడిగితే పై సమాధానం వస్తుంది.  అందువల్లే బుధవారం వైసీపీ నిరసన కార్యక్రమాలు జిల్లాలో అతిపేలవంగా జరిగాయి. కొన్నిచోట్ల అసలు జరగలేదు. చాలాచోట్ల పొదుపు గ్రూపుల మహిళలు కూడా వస్తే కానీ దీక్షలలో పాల్గొన్న వారి సంఖ్య వందకు చేరలేదు. దీంతో అధిష్ఠానం నియోజకవర్గాల వారీ నాయకులకు తీవ్రమైన హెచ్చరికలు జారీచేసింది. ఫలితంగా శుక్రవారం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీక్షలు నిర్వహించారు. అయినా ఒక్క చోటంటే ఒక్కచోట కూడా వెయ్యిమంది దీక్షలో పాల్గొన్న దాఖలాలు లేవు. పెద్దఎత్తున అధికార యంత్రాంగాన్ని కూడా వినియోగించుకుంటే వంద నుంచి 400మంది లోపే  పాల్గొనటం విశేషం. దీంతో తాజా పరిణామాలను పరిశీలిస్తే జిల్లాలో ఇటు అనూహ్యంగా టీడీపీ శ్రేణుల్లో పూర్తిస్థాయిలో  కదలిక రావటం, అటు అధికార పార్టీ కేడర్‌లో అసంతృప్తులు రగులుతున్న విషయం తేటతెల్లమైంది. 






Updated Date - 2021-10-23T07:13:48+05:30 IST