అధికారం అండ... దౌర్జన్య కాండ

ABN , First Publish Date - 2022-01-29T09:13:40+05:30 IST

సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు.. గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో అరాచకానికి పాల్పడుతున్నారు.

అధికారం అండ... దౌర్జన్య కాండ

టీడీపీ లక్ష్యంగా దాడులు


గుంటూరు, జనవరి 28: సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు.. గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో అరాచకానికి పాల్పడుతున్నారు. మూకుమ్మడి దహనాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. పం చాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు కోట హరేరామ్‌ గెలుపొందారు. వైసీపీ మద్దతుతో పోటీ చేసిన కోట రాజ్‌కుమార్‌  ఓటమి పాలయ్యారు. తన ఓటమికి కారకులెవరో తెలుసని, ఏ ఒ క్కరినీ వదిలేదిలేదంటూ ఫేస్‌బుక్‌లో రాజ్‌కుమార్‌ హెచ్చరికలు పంపాడు. ఆనాటి ను ంచి టీడీపీ మద్దతుదారులే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగిన అనంతరం మార్చిలో టీడీపీ సానుభూతిపరుల వరికుప్పలను, గడ్డివాములను దహనం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు.


ఆ తర్వాత ఈ నెల 18న టీడీపీ మద్దతుదారుల వరికుప్పలకు, ఆటో కు నిప్పుపెట్టి మూకుమ్మడి దహనాలకు పా ల్పడ్డారు. ఫిర్యాదు చేయటానికి బాధితు లు భయపడటంతో హరేరామ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. రాజ్‌కుమార్‌ ప్రోద్బలంతో ఉయ్యూరు రాంబాబు, రామాంజనేయులు తదితరులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫి ర్యాదులో పేర్కొన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో స్టేషన్‌కు తీసుకెళ్లకుండానే వదిలేశారు. ఆ తర్వాత ఈ ఘటనలపై విచారణ జరపలేదు. ఎవరి పైనా చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామ ంలో నెలకొన్న పరిస్థితులపై హరేరామ్‌ రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించి న్యాయ ం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం పంపారు. పోలీసులు, అధికారులు  బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 


వైసీపీ నాయకులంటే లెక్క లేదా నీకు!

తహసీల్దార్‌పై వైసీపీ సర్పంచ్‌ దాడి


హనుమంతునిపాడు, జనవరి 28: వైసీపీ నాయకులంటే లెక్కలేదా నీకు అంటూ తహసీల్దార్‌పై వైసీపీ సర్పంచ్‌ దాడి చేసిన సంఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది. మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన వైసీపీ నాయకులు, దాసరిపల్లి సర్పంచ్‌ భవనం కృష్ణారెడ్డి మేమంటే లెక్క లేదా మీకు.. అంటూ ఉద్యోగులపై ఊగిపోయాడు. మిగతా నాయకులు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఉద్యోగులు తహసీల్దార్‌ నాగార్జునరెడ్డికి సమాచారం అందించారు. కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న తహసీల్దార్‌ హుటాహుటిన సమావేశం హాలుకి చేరుకున్నారు. లోపలికి రాగానే తహసీల్దార్‌పై కృష్ణారెడ్డి ఆగ్రహంగా దూసుకుపోయి సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఉన్నందువల్లే రాలేకపోయానని ఆయన బదులిచ్చారు.


అయినా కృష్ణారెడ్డి.. సర్పంచ్‌ అంటే లెక్క లేదు, ఎంపీటీసీ అంటే లెక్కలేదు అంటూ తహసీల్దార్‌పైకి వెళ్లి ఒక్క తోపు తోయడంతో ఆయన కిందపడిపోయాడు. పైకి లేస్తుండగా ఏరా వైసీపీ నాయకులు నీ కంటికి కనపడరా ఏమిటి?.. అంటూ మీదమీదికి దూకాడు. పోలీసుల సాక్షిగా ఈ ఘటన జరిగినా వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోలేదు. జరిగిన ఘటనపై తహసీల్దార్‌ జిల్లా కలెక్టర్‌కు, ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేశారు.


అధికారులపై దాడులు....విపక్ష నేతలపై దౌర్జన్యాలు....ఇలా అధికారపార్టీ నాయకుల ఆగడాలకు ఫుల్‌స్టాప్‌ పడడం లేదు. తాజాగా...తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్యంగా గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఘటనలు జరగ్గా, ప్రకాశం జిల్లాలో ఏకంగా ఓ సర్పంచ్‌ మండలసర్వసభ్య సమావేశం సాక్షిగా తహసీల్దార్‌పై దాడికి తెగబడ్డాడు.

Updated Date - 2022-01-29T09:13:40+05:30 IST