ఉప ఎన్నికల్లో గెలవాల్సిందే..

ABN , First Publish Date - 2021-01-21T06:43:56+05:30 IST

త్వరలో జరిగే తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు టీడీపీ ముందునుంచే పావులు కదుపుతోంది.

ఉప ఎన్నికల్లో గెలవాల్సిందే..
తిరుపతిలో అచ్చెన్నాయుడితో సమావేశమైన జిల్లా నేతలు

 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు టీడీపీ పక్కా వ్యూహం

 జిల్లాలో పార్టీ సీనియర్‌ నేతలకు పలు నియోజకవర్గాల ఇంఛార్జులుగా నియమాకం

  పోలింగ్‌ పూర్తయ్యే వరకు సమీక్షలు, వ్యూహ ప్రతివ్యూహాల బాధ్యతలన్నీ అప్పగింత

కాకినాడ (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరిగే తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు టీడీపీ ముందునుంచే పావులు కదుపుతోంది. అందుకోసం ఇప్పటి నుంచే గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇందుకు జిల్లా ల నుంచి కూడా పార్టీ సీనియర్‌ నేతలందరినీ పంపి అక్కడ మోహరిస్తోంది. వీరికి మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులు, అబ్జర్వర్ల బాధ్యతలు కట్టబెట్టింది. వీరిలో కొందరికి మండలాలు, మరికొందరికి నియోజకవర్గ ఇంఛార్జులుగా నియమించింది. వీరంతా తమకు అప్పగించిన మండలాలు, నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయడం, బూత్‌స్థాయి, గ్రామ స్థాయిలో కేడర్‌తో తరచూ సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచార అస్త్రాలు సిద్ధం చేసి జనంలోకి తీసుకువెళ్లేలా చేయాల్సి ఉంది. ఇప్పటికే పలువురు జిల్లా నేతలు తిరుపతి లోక్‌సభ స్థానానికి చేరుకుని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసుకు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యత కేటాయించడంతో పెందుర్తి వెంకటేష్‌తో కలిసి గడిచిన కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సూళ్లురుపేట నియోజకవర్గ బాధ్యత వరుపుల రాజాకు అప్పగించడంతో ఆయన రెండు రోజుల కిందట చేరుకున్నారు. వీరు తిరుపతిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో బుధవారం జరిగిన           సమీక్షలో పాల్గొన్నారు. అటు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మరో రెండు రోజుల్లో అక్కడకు వెళ్లనున్నారు. వీరితోపాటు జిల్లా నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ పార్లమెట్‌ స్థానం అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌లకు బాధ్యతలు అప్పగించారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత పోలింగ్‌ తేదీ వరకు అక్కడే ఉండి వీరంతా పార్టీ విజయానికి అవసరమైన వ్యూహప్రతివ్యూహాలను అమలు చేయనున్నారు.

Updated Date - 2021-01-21T06:43:56+05:30 IST