రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు

ABN , First Publish Date - 2021-10-17T06:20:25+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ను అప్పులకుప్పగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
బిక్కవోలు, అక్టోబరు 16: ఆంధ్రప్రదేశ్‌ను అప్పులకుప్పగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని టీడీపీ రాష్ట్ర  ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విజయదశమిని పురస్కరించుకుని తొస్సిపూడి గ్రామంలో శుక్రవారం ఆయన జనచైతన్య యాత్రలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి తొస్సిపూడి నుంచే పార్టీ కార్యక్రమాలను ఆనవాయితీగా ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని 58 గ్రామాల్లోను ఈ కార్యక్రమాన్ని రెండు నెలల పాటు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ. 2 లక్షల కోట్లు ఉంటే అప్పులు రూ. 6 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ఏటా రూ. 42 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు, సీపీఎస్‌ను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్‌లు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచారని, కోతలు మొదలయ్యాయని, అమ్మఒడి జూన్‌కి వాయిదా పడిందని, సా మాజిక పింఛన్లు పెంచకుండా కోతలు విధిస్తున్నారని, రేషన్‌కార్డులు ఏరివేస్తున్నారని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణరెడ్డి, పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావు, పార్లమెంట్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు అచ్చిరెడ్డి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, సత్తిబాబు, దత్తుడు శ్రీను, మాజీ వైస్‌ ఎంపీపీ చింతా శ్రీనివాసరెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి కోనాల వెంకటరెడ్డి, చిన్నం వీరభద్రారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు దత్తుడు, మాజీ సర్పంచ్‌ సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:20:25+05:30 IST