చీరాలపై టీడీపీ దృష్టి

ABN , First Publish Date - 2021-02-25T06:54:43+05:30 IST

చీరాల మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది?

చీరాలపై టీడీపీ దృష్టి

ఆరా తీస్తున్న చంద్రబాబు 

బాలాజీ, ఏలూరితో మాట్లాడిన బాబు 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): చీరాల మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? మున్సిపల్‌ పోరు నామినేషన్‌లో మన పరిస్థితి ఏంటి. స్థానికంగా మన నాయకత్వం ఎలా వ్యవహరిస్తోంది. మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది. నేరుగా పార్టీ అధిష్టానం, ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. అంతేగాక ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బాలాజీతో పాటు బుధవారం పర్చూరు ఎమ్మెల్యే, టీడీపీ బాపట్ల లోక్‌సభ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావుతో కూడా చీరాల అంశంపై ప్రత్యేకంగా మాట్లాడి తగు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.


మున్సిపల్‌ పోరులో భాగంగా చీరాలకి కూడా ఎన్నికల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయింది. కోర్టు తీర్పు అంశాన్ని పక్కనబెడితే ఈ నోటిఫికేషన్‌ ప్రకారం 2, 3తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ, 10వతేదీ పోలింగ్‌ జరగబోతోంది. అయితే వైసీపీలో వర్గపోరుకి తోడు టీడీపీ అనూహ్యమైన సమస్యను ఎదుర్కొంటున్నందున ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ వైపు దృష్టిసారించింది. గతంలో నామినేషన్ల దాఖలు నాటికి ఎమ్మెల్యే బలరాం టీడీపీలో ఉన్నారు. అనంతరం ఆయన వైసీపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత యడం బాలాజీని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పార్టీ ప్రకటించింది. దీంతో అప్పట్లో బలరాం ఆధ్వర్యంలోనే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అప్పటికే బలరాం వైసీపీలోకి చేరే ఆలోచనలో ఉన్నందున నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థులు పకడ్బందీగా నామినేషన్లు వేయలేకపోయారు. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్‌ కూడా తన మద్దతుదారులతో నామినేషన్లు దాఖలు చేయించారు.


ప్రస్తుతం ఇద్దరు వైసీపీలో ఉన్నందున అక్కడ పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఎలా సమరంలో నిలపాలన్న విషయంపై ఆలోచన ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం 35 వార్డులకు గాను 16చోట్ల టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. వీరంతా అప్పుడు ఎమ్మెల్యే బలరాం సూచనతో నామినేషన్లు వేశారు కాబట్టి ప్రస్తుతం వారు ఎంతమేరకు పార్టీ పక్షాన నిలబడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ ఇన్‌చార్జ్‌ బాలాజీ వారందరితో పాటు మరికొన్ని వార్డుల్లో పోటీలో ఉన్న ఇండిపెండెంట్లతో మంతనాలు ప్రారంభించారు. అయితే అక్కడ యడం బాలాజీపై ఇటీవలే అధిష్ఠానంకు ఫిర్యాదు చేయటం, ఆ విషయంపై బాలాజీ మనస్తాపానికి గురై ఉండటంతో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడే ఆ వైపు దృష్టిసారించారు. అసలు యడం బాలాజీ సిన్సియర్‌గా పనిచేస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించటంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలోని విభేదాలను కూడా సొమ్ము చేసుకుని ఎలా ముందుకెళ్లాలన్న అంశానికి ప్రాధాన్యమిస్తున్నారు.


తదనుగుణంగా బాలాజీకి పలు సూచనలు చేయటంతోపాటు నిరంతరం అక్కడ పరిస్థితిని సమీక్షించే విధంగా కొందరు రాష్ట్ర నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. బాలాజీ పూర్తిగా బాధ్యతలు తీసుకుంటే సరి లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనైనా అవకాశం ఉన్నమేరకు వార్డుల్లో టీడీపీ శ్రేణులను పోటీలో ఉంచటం, కుదరని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు పార్టీ మద్దతు ప్రకటించటం ద్వారా బలమైన పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఉంది. ఈ విషయమై చంద్రబాబు నేరుగా బాలాజీతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. బుధవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి కూడా బాబు ఫోన్‌చేసి చీరాల విషయంపై చర్చించినట్లు తెలిసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలన్న విషయంపై గురువారం ఒక నివేదికనిస్తానని ఏలూరి చెప్పినట్లు తెలిసింది.  ప్రతిస్థానంలో టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉండాలని ఆ విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. 

Updated Date - 2021-02-25T06:54:43+05:30 IST