టీచర్ దెబ్బలకు తాళలేక విద్యార్థి మృతి.. నటిస్తున్నాడని బాలుడి తండ్రికి చెప్పిన ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2021-10-22T00:15:46+05:30 IST

రాజస్థాన్‌లోని చురు జిల్లా సలాసర్ గ్రామంలో దారుణం జరిగింది. హోం వర్క్ చేయలేదన్న

టీచర్ దెబ్బలకు తాళలేక విద్యార్థి మృతి.. నటిస్తున్నాడని బాలుడి తండ్రికి చెప్పిన ఉపాధ్యాయుడు

జైపూర్: రాజస్థాన్‌లోని చురు జిల్లా సలాసర్ గ్రామంలో దారుణం జరిగింది. హోం వర్క్ చేయలేదన్న కారణంతో ఏడో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు చావబాదాడు. అతడు కొట్టిన దెబ్బలకు తాళలేని విద్యార్థి ప్రాణాలు విడిచాడు. 13 ఏళ్ల విద్యార్థిని కర్రతో చితకబాదిన ఆ ఉపాధ్యాయుడిని మనోజ్ కుమార్‌గా గుర్తించారు. కోలాసర్‌కు చెందిన బాలుడి తండ్రి ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. తన కుమారుడు ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడని, ఎలాంటి కారణం లేకుండా టీచర్ తనను కొడుతున్నట్టు గత 15 రోజుల్లో నాలుగైదు సార్లు తనతో చెప్పాడన్నారు.


నిన్న (బుధవారం) ఉదయం 9.15 గంటల సమయంలో ఓం ప్రకాశ్‌కు ఫోన్ చేసిన ఉపాధ్యాయుడు మనోజ్.. తరగతి గదిలో బాలుడు అపస్మారకస్థితిలో పడిపోయినట్టు చెప్పాడు. హోం వర్క్ పూర్తి చేయలేదని రెండు దెబ్బలు వేశానని, దీంతో అతడు కళ్లు తిరిగి పడిపోయాడని తెలిపాడు. దీంతో కంగారుపడిన ఓం ప్రకాశ్.. కొంపదీసి బాలుడును కొట్టి చంపేశావా ఏంటి? అని ప్రశ్నించాడు. దీనికి ఉపాధ్యాయుడు బదులిస్తూ చనిపోయినట్టు నటిస్తున్నాడని పేర్కొన్నాడు. 


కాసేపటి తర్వాత ఓం ప్రకాశ్ స్కూలుకు చేరుకోగా అప్పటికే అతడి భార్య అక్కడ ఉంది. మిగతా విద్యార్థులందరూ భయంతో చూస్తున్నారు. బాధిత విద్యార్థిని టీచర్ మనోజ్ దారుణంగా కొట్టాడని, కాళ్లతో తంతూ పిడిగుద్దులు గుద్దాడని ఇతర విద్యార్థులు చెప్పారు. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాధిత బాలుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడు మనోజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.  

Updated Date - 2021-10-22T00:15:46+05:30 IST