Abn logo
Jul 5 2020 @ 02:10AM

ఆచార్యలక్షణములు

  • గురుబ్రహ్మ! గురువిష్ణుః! గురుర్దేవో మహేశ్వర్వః
  • గురుస్సాక్షాత్పర బ్రహ్మ! తస్మైశ్రీ గురవేనమః

త్రిమూర్త్యాత్మకస్వరూపుడు గురువు. గురువు అనగా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమును బోధించువాడు. గురుత్వం, రుజుత్వం, ఉన్నత స్థితి కల్గించువాడు గురువు. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపము కనుకనే అట్టి గురువునకు వందనమని ప్రార్థిస్తున్నాం. ఆచార్యుడనగా బుద్ధికుశలుడు, జ్ఞానబోధకుడు. ఈ లోకంలో విద్యను అభ్యసించేవారందరూ ఆచార్యుని ఆశ్రయించవలసిందే. పురాణేతిహాసాలలో కూడా గురువునకు  రాజులు ఆశ్రయమిచ్చి నివాసాదులు కల్పించి, తమబిడ్డలకు విద్యలు నేర్పించేవారు. సాందీపుని శ్రీకృష్ణ కుచేలురు, ద్రోణాచార్యుని పాండవాదులు, సమర్థ రామదాసును శివాజీ, విశ్వామిత్రుని శ్రీరాముడు తమ ఆచార్యులుగా స్వీకరించి విశ్వవ్యాప్తి చెందారు.


ఎన్నోశాస్ర్తాలు ఆచార్యలక్షణాలను వివరించాయి. సర్వకార్యోపదేశికం, సంస్కారం, వేదవిధులు, నిత్య అధ్యయనం, దయాదిగుణాలు, సర్వక్రియ విశేషజ్ఞ సంపదలు, జితేంద్రియుడు, శుభలక్షణ సంయుతుడు, భక్తిభావాదులు ఆచార్యలక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ లక్షణాలన్నీ ఉన్న గురువులే శిష్యుల మదిలో చిరస్థాయిగా తమస్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు.


ఆలయాలలో భగవంతునికున్న స్థానమేంతటిదో భువిలో ఆచార్యుని స్థానం అటువంటిదే. అందుకనే ఆచార్య దేవోభవ అన్నారు. అప్పాజీని శ్రీకృష్ణదేవరాయలు గురువుగా, తండ్రిగా భావించాడు కనుకనే సువిశాల సామ్రాజ్యానికి అధిపతిగా నిలిచాడు. శ్రీరామకృష్ణుని ఆచార్యునిగా ఎంచుకున్నాడు కనుకనే వివేకానందుడు విశ్వవ్యాప్తమైన కీర్తిని పొందగలిగాడు. భారతీయులకు మార్గదర్శకుడైనాడు. ఆచార్యుడనగా కేవలం గురుస్థానంలోనివాడే కాదు. మంచి చెడులను బోధిస్తూ విశ్వశాంతికి దోహదపడే అనుభవజ్ఞులైన పెద్దలనూ ఆచార్యులుగా పరిగణించవచ్చు.


ఆలయార్చకులను కూడా ‘‘ఆచార్యులు’’గా నేడు సంబోధిస్తున్నాం. వేదోక్త లక్షణాదులు కల్గి సంస్కారంతో భక్తి విశిష్టతలను సంతరించుకొని సమాజాన్ని మంచి మార్గంలో నడిపించగలవానిగా ఈ ‘ఆచార్యుడు’ వుండాలి. 


‘ఆచార్యుడు ఉత్కృష్ట స్థానాన్ని పొందాలంటే’ సర్వ కార్యాచరణ శీలత్వం పెంపొందించుకోవాలి. ‘హితుల’ను సన్నిహితులుగా మార్చుకోవాలి. మన ధర్మం, సంస్కృతులను, సత్య శీలత్వాన్ని కాపాడుకొంటూ శిష్యులకు దగ్గర కావాలి. అపుడే నిజమైన ‘ఆచార్యుడు’గా కీర్తి పొందుతాడు. నేటి సమాజంలో బడి, గుడి రెండింటినీ నడిపేవారు ఆచార్యులే. కనుక వారు సమాజానికి మంచి సంస్కృతిని, విద్యాబుద్ధులను నేర్పిననాడు ఈ భారతదేశం సుస్థిరమై, సంస్కృతికి ఆలవాలమౌతుంది. కావున అట్టి ఆచార్యులందరికీ మనం వందనాలర్పిద్దాం! వారిని ఆశ్రయిద్దాం. జీవితాలు ధన్యం చేసుకుందాం.


పరాంకుశం. శ్రీనివాసమూర్తి, 94934 55256

Advertisement
Advertisement
Advertisement