పోస్టుల కోసం.. పక్కదారి

ABN , First Publish Date - 2020-11-24T05:16:26+05:30 IST

పాఠశాలల్లో పోస్టులను కాపాడుకునేందుకు, కొత్త పోస్టుల కోసం ఉపాధ్యాయులు పక్కదారి పడుతున్నారు.

పోస్టుల కోసం.. పక్కదారి

పాఠశాలల్లో విద్యార్థుల డేటా చౌర్యం

ఇతర పాఠశాలలకు పంపినట్లు నిర్ధారణ

ఒక పాఠశాలలో అడ్మిషన్లు, మరో పాఠశాలలో పేర్లు

తాడికొండ నవంబరు 23: పాఠశాలల్లో పోస్టులను కాపాడుకునేందుకు, కొత్త పోస్టుల కోసం ఉపాధ్యాయులు పక్కదారి పడుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలియకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యార్థులను ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు టీసీలు ఇచ్చి పంపుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది విద్యార్థుల వివరాలు రెండు పాఠశాలల్లో కన్పించడంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. తాడికొండ మండలం లాం గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాఽథమికోన్నత పాఠశాలలో 14 మంది విద్యార్థులు ఆడ్మిషన్‌ పొందారు. చైల్డ్‌ ఇన్ఫోలో వారి వివరాలను పరిశీలించగా లాం శివారు గ్రామమైన తాతిరెడ్డిపాలెం ఎంపీయూపీలో 12, ఫణిదం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రకారం ఆయా పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను కేటాయించటం జరుగుతుంది. దీంతో కొంతమంది అక్రమాలకు పాల్పడి విద్యార్థుల వివరాలను తస్కరించి తమకు కావాల్సిన పాఠశాలల్లో నమోదు చేసుకుంటున్నారని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. లాం పాఠశాల విద్యార్థుల వివరాలు తాతిరెడ్డిపాలెం, ఫణిదం పాఠశాలకు ఎలా వెళ్లాయని ఎంఈవోకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.    ఆర్‌జేడీకి, డీఈవోకు ఫిర్యాదు చేయటంతో డీవైఈవో నారాయణరావు సోమవారం విచారణ జరిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.   

నిజాలు నిగ్గుతెల్చాలి

ముక్కాల విన్సెంట్‌ ఫిలోమెన్‌, హెచ్‌ఎం


విద్యార్థుల డేటా చౌర్యంపై నిజాలను నిగ్గుతెల్చాలని పాటిబండ్ల సీతారామయ్య మండల పరిషత్‌ ప్రాఽఽథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముక్కాల విన్సెంట్‌ ఫిలోమెన్‌ తెలిపారు. పోస్టుల కోసం కొంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో  ఆటలాడుతున్నారన్నారు. విద్యార్థులను అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు మార్చటం విద్యా వ్యవస్థకే తీరని మచ్చన్నారు.

Updated Date - 2020-11-24T05:16:26+05:30 IST